Begin typing your search above and press return to search.

ఎవరు ఎవరిని మోసం చేశారు పవన్?

By:  Tupaki Desk   |   7 Dec 2017 9:30 AM GMT
ఎవరు ఎవరిని మోసం చేశారు పవన్?
X
‘‘ఓ మంచి పని చేయాలనుకున్న మెగాస్టార్ చిరంజీవిని చిన్నచిన్న కీటకాలు తినేశాయి.. వారు నా అన్నకు చేసిన ద్రోహం కంటే, ప్రజలకు చేసిన ద్రోహమే తీవ్రమైనది. చిన్నపాటి స్వలాభాల కోసం, స్వల్పకాల ప్రయోజనాల కోసం ఓ గొప్ప ప్రయత్నానికి వారు అడ్డు తగిలారు. సీట్లు దక్కలేదని, అధికారం చేజిక్కలేదన్న బాధ నాకు లేదు, నవ రాజకీయాన్ని సృష్టించలేకపోయామన్నదే నా బాధ’’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి రాజకీయ జీవితం గురించి, ప్రజారాజ్యం పార్టీ గురించి తాజాగా మాట్లాడడం సెన్సేషన్‌ గా మారింది. ఇది పవన్ పట్ల అనేక కొత్త అనుమానాలు ముసురుకునేలా చేస్తోంది. తన అన్న చిరంజీవికి ద్రోహం చేసిన వారిని, మోసగించినవారిని వదలబోనని, తగిన బుద్ధి చెప్తానని పవన్ ప్రకటించారు. అయితే... ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఎవరు ఎవరిని మోసగించారు.. ఎవరు ఎవరికి ద్రోహం చేశారు.. ఎవరి వల్ల ఎవరి రాజకీయ జీవితాలు ముగిసిపోయాయన్నది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.

సినీ నటుడు చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఆ తరువాత ఎంతో క్రియాశీలంగా వ్యవహరించిన ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు తన సొంత రాజకీయ పార్టీ జనసేనను 2019 ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉన్నప్పుడు కూడా పవన్ కాలికి బలపం కట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఆయనకు అప్పటి రాజకీయ పరిస్థితులు తెలుసు.. ఇప్పటి పరిస్థితులూ తెలుసు. ఈ పదేళ్లలో ఏమేం మార్పులొచ్చాయో అంతా తెలుసు. వీటికి తోడుగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వారి లక్ష్యమేమిటి అన్నది కూడా బాగా తెలిసే ఉంది కాబట్టే ఇప్పుడీ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న చిరంజీవి కోరిక తీరకపోవడం గురించే పవన్ బాధంతా అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసినప్పుడు ఏం రహస్య ఒప్పందాలు జరిగాయో అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ... ఆన్ లైన్, ఆఫ్ లైన్ అంతా దీనిపైనే కామెంట్లు.

ఇదంతా ఒకెత్తయితే... చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడం వల్ల ఆయనకు జరిగిన నష్టం కంటే ఆ పార్టీని, చిరంజీవిని నమ్మి ఆయనతో కలిసి నడిచిన ఇతర పార్టీల నేతలకు జరిగిన నష్టమే ఎక్కువన్నది కాదనలేని సత్యం. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న అప్పటి చురుకైన నేతలు కొందరు ప్రజారాజ్యంలోకి వచ్చి తరువాత సోదిలోకి కూడా కనిపించకుండా పోయారని జనం గుర్తుచేస్తున్నారు.

దేవేందర్ గౌడ్ - తమ్మినేని సీతారాం - కొత్తపల్లి సుబ్బారాయుడు.. ఇలా ఆ లిస్టు చెప్పుకొంటూ పోతే భారీగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో మంచి పొజిషన్లో ఉంటూ తెలంగాణలో ప్రభావవంతమైన నేతగా ఉన్న ఆయన ఆ తరువాత నవతెలంగాణ ప్రజాపార్టీ పేరుతో తెలంగాణ రాష్ర్టంలో సొంత పార్టీ పెట్టుకుని తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్న సమయంలో ఆయన పార్టీని ప్రజారాజ్యంలో కలిపారు. ఆ తరువాత ప్రజారాజ్యంతో పాటు దేవేందర్ గౌడ్ కూడా రాజకీయంగా పూర్తిగా ప్రభ కోల్పోయారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం కూడా రాజకీయంగా మంచి జోరు మీద ఉండేవారు ప్రజారాజ్యంలో చేరిన తరువాత ఆయన రాజకీయ జీవితం కకావికలమైపోయింది. కొత్తపల్లి సుబ్బారాయుడిదీ అదే కథ... చంద్రబాబు వద్ద మంచి పేరున్న ఆయన సొంత జిల్లాకు చెందిన చిరంజీవిని నమ్ముకుని టీడీపీని వదిలేశారు. 2009 ఎన్నికల నుంచి ఆయనకు ఓటమే ఎదురవుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ప్రజారాజ్యం రాకుంటే ఆయన రాజకీయ జీవితం మరోలా ఉండేదని ఇప్పటికీ అనుచరులు అంటుంటారు. వీరే కాదు ఇలాంటివారు ఇంకా ఉన్నారని జనం గుర్తుచేస్తున్నారు..

మరి... పార్టీని కాంగ్రెస్‌ లో కలిపేసిన చిరంజీవి పరిస్థితి ఏంటి. 18 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ లో కలిపేసినందుకు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి దక్కాయి. ఆయన కోరుకున్నట్లు సీఎం కుర్చీ దక్కి ఉండకపోవచ్చు.. కాంగ్రెస్ పరిస్థితే బాగుంటే అది కూడా జరిగే ఉండేది. విభజన సమయంలో ఆయన వద్దకు అధిష్ఠానం నుంచి ఆ ప్రతిపాదన వచ్చినా అప్పటి సంక్లిష్టతల దృష్ట్యా ఆయనే తిరస్కరించారన్న వాదనా ఒకటి ఉంది. మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా చిరంజీవికి పెద్ద నష్టమేమీ జరగలేదు. నష్టపోయిందంతా ఆయన్ను నమ్మి వచ్చిన నేతలు.. కులం, అభిమానులు, రాష్ర్టప్రజలు మాత్రమేనని నెటిజన్లు అంటున్నారు.

కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, పవన్ దృష్టిలో చిరంజీవిని మోసం చేసినవారంటే బహుశా అప్పట్లో పార్టీ వ్యవహారాలు - టిక్కెట్ల సంగతి చూసుకున్న ఆయన కుటుంబంలోని వారి గురించేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి తన అన్నను గుర్తుచేసి పవన్ తాను కూడా ఏం చేయబోతున్నాడో చెప్పకనే చెప్పారని... తెలివున్న నేతలంతా ఆయన వెంటపడడం మాని ఉన్న పార్టీల్లోనే ఉండడం బెటరని సోషల్ మీడియాలో కొందరు జాగ్రత్తలు కూడా చెప్తున్నారు.