పీకే మాట..బాబు నిర్ణయం ఎలాంటిదైనా జగన్ కొనసాగించాల్సిందేనట!

Sat Aug 24 2019 20:18:11 GMT+0530 (IST)

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై జరుగుతున్న వాదులాటలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగిపోయారు. అది కూడా అలా ఇలా కాకుండా తనదైన శైలి స్టేట్ మెంట్లతో ఈ వివాదం మరింత ముదిరేలా భారీగానే దిగిపోయారు. ఏపీ రాజధానిని అమరావతిలో నిర్మిస్తున్నట్లుగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదో - చెడుదో తనకు తెలియదంటూనే... అది మంచిదైనా - చెబుదైనా కూడా ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కొనసాగించి తీరాల్సిందేనని కూడా ఆయన సంచలన కామెంట్ సంధించారు. అసలు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మంచిదో - చెడుదో చెప్పకుండానే పవన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.రాజధాని నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఆందోళనకు గురైన రాజధాని రైతులు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షఁడు కన్నా లక్ష్మీనారాయణతో కలిశారు. తాజాగా శనివారం పవన్ కల్యాణ్ వద్దకూ వారు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల వాదనను విన్న పవన్ కల్యాణ్ సంచలన కామెంట్లు చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన పవన్... ఈ నిర్ణయాన్ని ఏపీ అసెంబ్లీ కూడా ఆమోదించిందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న గత ప్రభుత్వం తీసుకున్న అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన నిర్ణయాన్ని ఇప్పుడు కొత్తగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అమలు చేసి తీరాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ ను తాను ఎందుకు వినిపిస్తున్నానన్న విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు మార్చుకుంటూ పోయే సంస్కృతికి శ్రీకారం చుడితే... ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోక తప్పదని ఆయన చెప్పారు. తద్వారా శాశ్వతంగా నిర్మించాల్సివ రాజధానికి అసలు రూపు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసంబద్ధమైనదని తేలితే... దానిని సరిదిద్దాల్సిందేనన్న భావనను వ్యక్తం చేసిన పవన్... రాజధాని లాంటి కీలక విషయాల్లో మాత్రం ఇలాంటి వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అందరం శిరసావహించక తప్పదన్న వాదననూ వినిపించిన పవన్... సీమాంధ్రులకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని విభజించినా - డీమానిటైజేషన్ అంటూ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే ఓ కుదుపు కుదిపేసిన మోదీ నిర్ణయాన్ని శిరసావహించాం కదా అని చెప్పి తన వాదనకు బలం చేకూరే వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనం బందీలమని కూడా ఆయన మరో సంచలనాత్మక వ్యాఖ్య చేశారు. మొత్తంగా రాజధాని లాంటి కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో ఆయా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరును ఏమాత్రం ప్రస్తావించకుండానే... ఆయా నిర్ణయాలను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించి తీరాలని పవన్ డిమాండ్ చేయడం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు.