Begin typing your search above and press return to search.

తుని లా జరిగితే తప్ప పవన్ స్పందించరా?

By:  Tupaki Desk   |   27 July 2017 5:15 PM GMT
తుని లా జరిగితే తప్ప పవన్ స్పందించరా?
X
జనసేన పార్టీ అధినేత ప్రజల ఎదుట బహిరంగ సభల్లో మాట్లాడేప్పుడు... ‘‘నన్ను విమర్శించేవాళ్లు.. నేనేదో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నానంటూ రకరకాల మాటలు అంటూ ఉంటారు. కానీ నాకు తెలుసు. ప్రజల మీద ప్రేమ తప్ప నేనెవ్వరికీ అనుకూలంగా ఉండే వ్యక్తిని కాదు’’ అని తరచుగా అంటుంటారు. కానీ ప్రస్తుత పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి. కాపుల ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రం ఒకవైపు అట్టుడికి పోతూ ఉంటే.. రాష్ట్రాన్నంతా పోలీసుమయం చేసేసి, ఒక వర్గాన్ని మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం దొంగల్లాగా రౌడీల్లాగా పరిగణిస్తూ మాట్లాడుతున్న వేళలో.. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఏమాత్రం స్పందించకపోతే ఎలా అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే పరిస్థితులు ఉద్రిక్తతల దిశగా వెళుతున్నాయి. మరి.. తుని లాంటి దుర్ఘటన జరిగితే తప్ప పవన్ కల్యాణ్ స్పందించరా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ .. తనను ఒక కులానికి చెందిన వ్యక్తిగా చూడవద్దంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. ఆయనకు ఆ పట్టింపు లేకపోవచ్చు. మంచిదే. కానీ.. ఆయన అభిమానుల్లో ఆ స్పృహ మెండుగానే ఉంది. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కీలకాంశం ఏమిటంటే.. కులం కొలమానం మీదినుంచి కాకపోయినా.. రాష్ట్రంలో ఒక సామాజిక ఉద్యమాన్ని తొక్కేయడానికి ప్రభుత్వం దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు.. ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ నామమాత్రంగానైనా స్పందించకపోతే ఎలాగ?

గతంలో కాపుల సభ జరిగిన సందర్భంలో తుని అల్లర్లు చెలరేగిన తర్వాత.. పవన్ కల్యాణ్ స్పందించారు. వారిపట్ల సానుభూతి ప్రకటించారు. అయితే ఇప్పుడు పోలీసుల దాష్టీకానికి ఒక సామాజిక వర్గం దారుణంగా బలైపోతున్నది. తుని స్థాయిలో కాకపోవచ్చు.. కానీ చిన్న చిన్న అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ వర్గంలో పోలీసులు తొక్కిపెడుతున్న ఆవేశం ఎప్పుడు బద్ధలవుతుందో తెలియని పరిస్థితి. పరిస్థితులు ఇలా దారితప్పిపోతున్నప్పుడు కూడా.. తనకు తోచిన రీతిలో దిశానిర్దేశం చేయడానికి పవన్ కల్యాణ్ స్పందించకపోతే ఎలా? అనే వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది.

నిజానికి పవన్ చేపడుతున్న ఉద్ధానం వంటి సామాజిక సమస్యలు - ప్రభుత్వంతో చర్చలు ఇవన్నీ చిన్న విషయాలేం కాదు.. అయితే.. సామాజిక వర్గానికి చెందిన ఇలాంటి అంశాలను కూడా ఆయన పట్టించుకోవాలి కదా అనే మాట వినిపిస్తోంది. దీనికి పవర్ స్టార్ ఎలా స్పందిస్తారో?