Begin typing your search above and press return to search.

పవన్ ఆ విషయం వదిలేసి పోరాడితే బెటర్

By:  Tupaki Desk   |   25 April 2018 9:45 AM GMT
పవన్ ఆ విషయం వదిలేసి పోరాడితే బెటర్
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య అందరికీ కొత్తగా కనిపిస్తున్నాడు. రాజకీయ పార్టీ పెట్టిన నాటి నుంచి మరీ మెతకగా.. ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన పవన్.. ఈ మధ్య ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. శ్రీరెడ్డి తనను బూతు మాట తిట్టడంపై ఆయన పెద్ద ఎత్తునే ఆందోళన చేపడుతున్నాడు. శ్రీరెడ్డితో ఇలా చేయించింది కొన్ని మీడియా సంస్థలే అని చెబుతూ.. వాటిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ సీన్లోకి తెలుగుదేశం పార్టీ నేతల్ని కూడా తీసుకొస్తున్నాడు పవన్. ఐతే ఈ క్రమంలో కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లతో పవన్ జనాల్ని అయోమయానికి గురి చేశాడు. అసలు పవన్ లక్ష్యమేంటి అనే సందేహాలు రేకెత్తించాడు. శ్రీరెడ్డి తనను బూతు తిట్టడం మీదే పూర్తి ఫోకస్ పెట్టి.. దాని చుట్టూనే ట్వీట్లు వేయడం.. టీవీ ఛానెళ్లను.. తెలుగుదేశం పార్టీని లక్షంగా చేసుకోవడంతో వచ్చింది సమస్య.

పవన్ మీడియాను లక్ష్యంగా చేసుకోవడం.. వాళ్ల బాగోతాల్ని ఎక్స్ పోజ్ చేయడానికి ప్రయత్నించడంలో ఏమాత్రం తప్పలేదు. నిజంగానే తెలుగు మీడియా తీరు చాలా దారుణంగా.. జుగుప్సాకరంగా ఉంటుందన్నది వాస్తవం. ఉన్నదున్నట్లు మాట్లాడుకోవాలంటే దేశం మొత్తంలో మన మీడియా ఉన్నంత దారుణంగా మరేదీ లేదనే చెప్పాలి. టీఆర్పీలే లక్ష్యంగా.. సంపాదనే ధ్యేయంగా నడుస్తుంటాయి చాలా న్యూస్ ఛానెళ్లు. ఇందుకోసం సెన్సేషనలిజానికి పెద్ద పీట వేస్తుంటాయి. అలాగే తటస్థ ముసుగేసుకుని లోలోన రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఛానెళ్లూ చాలానే ఉన్నాయి. ఈ విషయాలపై గట్టిగా ప్రశ్నించే వాయిస్ లేక చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. ఇన్నాళ్లకు పవన్ రూపంలో ఒక గొంతుక రావడం మంచిదే. కానీ పవన్ విస్తృత ప్రయోజనాలతో ఈ పోరాటం చేస్తే మంచిది. టీవీ ఛానెళ్ల లొసుగుల్ని ఎత్తి చూపడానికి.. వాళ్ల బాగోతాల్ని బయటపెట్టడానికి చాలా అంశాలు.. ఉదాహరణలు ఉండగా.. పవన్ ఎంతసేపూ శ్రీరెడ్డి తనను అన్న బూతు మాటనే పట్టుకుని.. దాని చుట్టూ తన పోరాటాన్ని నడుపుతుండటమే సిల్లీగా అనిపిస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి.. సెంటిమెంటు పండించడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడానికి ఇదే కారణం. కాబట్టి పవన్ ఇప్పటికైనా రూటు మారిస్తే మంచిది. ఆయన చేస్తున్న పోరాటం అత్యావశ్యకమైందే.. కానీ దాన్ని సరైన మార్గంలో నడిపించాలి. ఈ విషయంలో ఆయనకు సరైన సలహాలు అందాలి. అదే జరిగితే పవన్ పోరాటం మంచి ఫలితాలే అందిస్తుంది.