Begin typing your search above and press return to search.

పవన్ జనసేన సభ్యత్వాలకు ఆధార్ లింక్?

By:  Tupaki Desk   |   20 Sep 2017 3:52 AM GMT
పవన్ జనసేన సభ్యత్వాలకు ఆధార్ లింక్?
X
పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలో చాలా కచ్చితత్వంతో వ్యవహరించదలచుకుంటున్నారా? పారదర్శకతను పాటించదలచుకుంటున్నారా? తొలిదశలో ఈ సభ్యత్వ నమోదు వ్యవహారాన్ని మొత్తం ఆన్ లైన్ లో మాత్రమే నడపదలచుకుంటున్న పవన్ కల్యాణ్ మరింత ఖచ్చితత్వం డూప్లికసీ లేకుండా ఉండడం కోసం తమ సభ్యత్వాలను ఆధార్ తో కూడా లింక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే గనుక.. యావత్ దేశంలోనే తమ పార్టీ సభ్యత్వాలను ఆధార్ తో లింక్ చేసిన తొలి పార్టీగా జనసేన రికార్డు పుటల్లోకి ఎక్కుతుందని.. ఆ రకంగా పారదర్శకత, స్వచ్ఛ వ్యవహారాలకు పెద్దపీట వేసే పార్టీగా గుర్తింపు కూడా తథ్యం అని పవన్ కల్యాణ్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన పార్టీ సభ్యత్వాలను ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఇవ్వబోతున్నారు. ప్రధానంగా యువత ఎక్కువగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఈ తరహాలో సభ్యత్వాలు ఇవ్వడం వల్ల ఎంత మంది జాయిన్ అయ్యారనే వివరాలు చాలా ఖచ్చితంగా కూడా ఉంటాయి. పార్టీలోని కార్యకర్తలు శ్రేణుల గురించి చాలా ఖచ్చితమైన డేటాబేస్ పార్టీ వద్ద ఉంటుంది. దీనిని చాలా రకాలుగా పార్టీ పరంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారితో నిత్యం టచ్ లో ఉండడమూ.. పార్టీ కార్యకలాపాలకు సంబంధించి సభ్యలుందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండడమూ ఇలాంటి వన్నీ సుసాధ్యం అవుతాయి. అయితే ఇదే తరహాలో.. సభ్యత్వ నమోదుకు ఆధార్ ను కూడా అనుసంధానం చేస్తే ఇంకా బాగుంటుందనేది పవన్ యోచనగా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. సాంప్రదాయ పార్టీలు సభ్యత్వాలు నమోదు చేసినట్లుగా.. కిందిస్థాయి నాయకులు ఒక్కొక్కరు సభ్యత్వ నమోదు పుస్తకాల్లో పదేసి పేర్లు రాసేసి.. రసీదులు చించేయడం వంటి లోపాయికారీ పద్ధతులు ఉండవని.. ఎలాంటి డూప్లికసీ, నకిలీ సభ్యత్వాల నమోదు వంటివి లేకుండా.. పార్టీ వ్యవస్థాగత నిర్మాణం చాలా పక్కాగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.