Begin typing your search above and press return to search.

పవన్ కలవరింత.. వెనుక కుమారస్వామి..

By:  Tupaki Desk   |   21 May 2018 10:37 AM GMT
పవన్ కలవరింత.. వెనుక కుమారస్వామి..
X
పవన్ కళ్యాణ్ నోట ఆశ్చర్యపరిచే మాట.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తొలిసారి ‘సీఎం అవుతాను.. నేను సీఎంను’ అంటూ ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకూ పవన్ లో ఇలాంటి కోణాన్ని ఎవరూ చూడలేదు.. ఇప్పుడు ఎవరినీ కదిలించినా.. తనకు సీఎం అవ్వాలనే లక్ష్యం, కోరిక లేదని.. తనకు బలం సరిపోదని అనేవాడు..

ఇప్పుడు హఠాత్తుగా, జనసేనాని తన టార్గెట్ సీఎం అవ్వడం అని ప్రకటించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది పవన్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నా.. కాస్త ఆలోచించే వాళ్లకు మాత్రం .. ఇదేమీ వ్యూహమా.. అనిపించకమానదు.. కర్ణాటక ఎన్నికల ఫలితాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.. 78 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ పార్టీకి మద్దతిచ్చింది. దీంతో ఆ పార్టీ అధినేత కుమారస్వామి సీఎం పదవిని కైవసం చేసుకోబోతున్నాడు. 23న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలోనే పవన్ లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.

ఏపీలో 2019లో హంగ్ వచ్చి తీరుతుందని.. తాను ముప్పై సీట్లు గెలుచుకున్నా చాలు.. ఎవరో ఒకరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనన్న ధీమా పవన్ లో కనిపిస్తోంది. కుమారస్వామి 37 సీట్లతో సీఎం అయినట్టుగానే.. ఆంధ్రాలో అదృష్టం కలిసొస్తే తాను కూడా సీఎం అవ్వవచ్చని పవన్ భావిస్తున్నాడు.

ఇప్పుడు లేచినా.. పడుకున్నా పవన్ కు కుమారస్వామే కనిపిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో కనీసం ముప్పై సీట్లు గెలుచుకున్నా.. తాను కింగ్ నో.. కింగ్ మేకర్ నో కావడం గ్యారెంటీ అని పవన్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే పదే పదే సీఎం అవుతానంటూ శ్రీకాకుళం పర్యటనలో కలవరిస్తున్నాడు. కర్ణాటకలో వలే పవన్ కింగ్ మేకర్ అవుతాడా.? లేదా అన్నది..? చూడాలి మరి