Begin typing your search above and press return to search.

బాబుకు పవన్ ‘ప్రత్యేక’ దన్ను

By:  Tupaki Desk   |   28 Aug 2016 5:50 AM GMT
బాబుకు పవన్ ‘ప్రత్యేక’ దన్ను
X
ఒక్క రోజు వ్యవధిలో బహిరంగ సభను నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 65 నిమిషాల సేపు మాట్లాడారు. మూడు అంశాల గురించి మాట్లాడటానికి తాను సభను ఏర్పాటు చేసినట్లుగా చెప్పిన ఆయన.. అంతకు మించిన అంశాల్నే ప్రస్తావించారు. నిజానికి ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక అంశాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తాజాగా నిర్వహించిన బహిరంగ సభ ద్వారా పవన్ సందేశం చాలా స్పష్టంగా ఉంది. గడిచిన రెండున్నరేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని సరైన సమయంలో ప్రస్తావిస్తానని చెబుతూ వచ్చిన పవన్.. మూడు నాలుగు రోజుల ముందే.. కర్ణాటక రాష్ట్రమాజీ ముఖ్యమంత్రి తనతో భేటీ అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వనని తేల్చిచెప్పిన తర్వాత తాను స్పందిస్తానని.. తాను చేయాల్సింది చేస్తానని చెప్పటం తెలిసిందే.

తాను చెప్పిన మాటకు భిన్నంగా పవన్ ప్రత్యేక హోదా మీద ఉద్యమం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ తర్వాతేం ఎన్డీయే సర్కారు.. ఏపీ ప్రత్యేక హోదా మీద ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటనా చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినప్పటికీ పవన్ ప్రత్యేక హోదా మీద గొంతు విప్పటం ఆసక్తిని రేకెత్తించే అంశమే.

తన ప్రసంగంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీని ఉతికి ఆరేసిన పవన్ కల్యాణ్.. ఇక తన పోరాటం ఒకనాటి తన మిత్రుడితోనే అన్న విషయాన్ని తేల్చేశారు. ఏపీని ఆదుకుంటానని.. అన్నీ విధాల సాయం చేస్తానని చెప్పిన మోడీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. అదే సమయంలో ప్రత్యేక హోదా పై ఏపీ అధికారపక్షం చేసిన ప్రయత్నాల్ని మాత్రమే ప్రస్తావించిన పవన్.. ఆ విషయంలోకి మరీ డీప్ గా మాత్రం వెళ్లలేదు. ప్రత్యేక హోదా సాధన కోసం మూడు దశల్లో పోరాటం చేస్తానని చెప్పిన పవన్.. అందులో భాగంగా సెప్టెంబరు 9న తన తొలి బహిరంగ సభను కాకినాడలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ మాటలు స్పష్టం చేసేదేమంటే.. ప్రత్యేక హోదా పోరాటాన్ని పవన్ కల్యాణ్ తన భుజాల మీద వేసుకున్నారనే. పవన్ సంగతిని పక్కన పెడితే.. ఆయన చెప్పిన మాటలు ఏపీ ముఖ్యమంత్రికి భారీ రిలీఫ్ అనే చెప్పాలి. పవన్ ను విమర్శించకుండా ఉండటంతో పాటు.. పవన్ చేస్తున్న పోరాటానికి నైతిక మద్ధతు ఉందనేలా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తే సరిపోతుంది. ప్రత్యేక హోదా మీద ఏపీ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను పవన్ ఎప్పటికిప్పుడు రాజేస్తూ కేంద్రం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో పవన్ కు చంద్రబాబు సహకారం అందిస్తే చాలు.. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే.. మరోవైపు అదే కేంద్రాన్ని ఇరుకున పెట్టిన వారు అవుతారు. పవన్ లాంటి వ్యక్తి ఎవరి మాట వినరన్న విషయం అందరికి తెలిసిన నేపథ్యంలో.. ఆయన్ను కంట్రోల్ చేయాలన్న మాటను ఏపీ ముఖ్యమంత్రికి చెప్పలేరు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ అధికారపక్షం ఏం చేస్తుందన్న విమర్శ ఇకపై ఉండదు. ఎందుకంటే.. పవన్ చేసే ప్రయత్నానికి తమ మద్ధతు ఉండటంతో పాటు.. ఆయనకు అనుకూలంగా పార్టీ నేతలు ప్రకటనలు చేస్తే సరిపోతుంది. పవన్ ఫుణ్యమా అని చంద్రబాబుకు భారీ రిలీఫ్ దొరకనుందనే చెప్పాలి. ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ కేంద్రం మీద పోరాటం చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. అందులోకి.. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంతో తగువు మంచిది కాదు. ఆ భారమంతా పవన్ తీసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ ‘ప్రత్యేక’ దన్నుగా మారతారనటంలో ఎలాంటి సందేహం లేదు.