Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మార్కులు: బాబుకు 10కి 2.5..కేసీఆర్‌ కు 6

By:  Tupaki Desk   |   19 March 2018 9:57 AM GMT
ప‌వ‌న్ మార్కులు: బాబుకు 10కి 2.5..కేసీఆర్‌ కు 6
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోమారు జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ మ‌రోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ద‌ఫా జాతీయ మీడియాలో ఆయ‌న అవినీతిపై విరుచుకుప‌డ్డారు. న్యూస్18 చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు తనయుడు లోకేష్ అవినీతి - ఏపీకి ప్రత్యేక హోదా - కేంద్రంపై పోరాటం - బాబు - కేసీఆర్ పాలనలపై ఆయన అభిప్రాయాలను నిర్మోహ‌మాటంగా వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రం విచారణ జరిపి తీరాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు.

లోకేష్ అవినీతి గురించి త‌న‌తో ప‌లువురు ఎమ్మెల్యేలే చెప్పార‌ని ప‌న‌వ్ క‌ళ్యాణ్ చెప్పారు. `40 మంది టీడీపీ ఎమ్మెల్యేలే లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని నాతో చెప్పారు...చంద్రబాబుకు ఇదే విషయాన్ని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నా.. పట్టించుకోలేదు. తన ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని బాబుకు స్పష్టంగా తెలుసు. ఆయన స్పందించకపోవడంతోనే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్‌ ను ఓ ప్రైవేట్ కాంట్రాక్ట‌ర్‌ కు అప్పగించడం వెనుక కూడా దురుద్దేశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి` అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ అవినీతి అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు అని ప్రశ్నించగా.. `నాకు ప్రధాని తెలిసినా నా పరిమితులు నాకు ఉంటాయి. నేనేమీ ఎంపీని కాదు. అయినా టీడీపీ - బీజేపీ మధ్య మంచి బంధం ఉంది. నేనిప్పుడు లోకేష్‌ పై ఆరోపణలు చేస్తుంటే నా వెనుక మోడీ ఉన్నారంటున్నారు. గతంలో జగనేమో నా వెనుక బాబు ఉన్నారన్నారు. కానీ ఇద్దరూ తప్పు. నేను కేవలం ప్రజలు చెప్పిందే వింటున్నాను` అని పవన్ స్పష్టంచేశారు.

ఇక కీల‌క‌మైన ఏపీ ప్రత్యేక హోదాపై ప‌వ‌న్ స్పందించారు. `రాష్ర్టానికి హోదా వస్తుందా రాదా అన్నది అనవసరం. పేరు, హోదాతో పనిలేదు. ప్రస్తుతం రాష్ర్టానికి కేంద్రం ఆర్థిక సాయం కావాలి. మా డిమాండ్లను నెరవేర్చుకునేవరకు బీజేపీపై పోరాటం ఆగదు. ప్రస్తుతానికి జనసేన ఒంటరి పోరాటం చేస్తోంది. ఎన్నికల సమయంలో అవసరమైతే ఎవరితో కలిసి వెళ్లాలో నిర్ణయించుకుంటాం` అని పవన్ పెండింగ్‌ లో ఉంచారు.

ఇత‌క తెలంగాణ రాజ‌కీయాలు, కేసీఆర్ మూడో ఫ్రంట్‌పైనా పవన్ మాట్లాడారు. ఈ విషయంలో కేసీఆర్‌ను కలిసి మాట్లాడాను. మూడో ఫ్రంట్ దిశగా చర్చించినా.. పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉంది. బీజేపీ - కాంగ్రెస్ రెండూ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి. అందుకే ప్రస్తుతం దేశానికి మూడో ఫ్రంట్ అవసరం అని పవన్ చెప్పారు. చివరగా కేసీఆర్ - బాబు పాలనలకు పదికి ఎన్ని మార్కులు ఇస్తారని అడగ్గా.. కేసీఆర్‌ కు 6 - బాబుకు 2.5 మార్కులు ఇస్తా` అని స్పష్టంచేశారు.