ఇంత హడావుడెందుకు పవన్..?

Sun Jan 21 2018 16:22:29 GMT+0530 (IST)

తెలంగాణలోని కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని నిన్న ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ పర్యటన ఎప్పటి నుంచన్నది ఈ రోజు ప్రకటించారు. రేపటి నుంచే - అంటే 22వ తేదీ నుంచే తన యాత్రకు శ్రీకారం చుడుతున్నారాయన. మూడు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతే... పవన్ ఇంత హడావుడిగా తన పర్యటనను ఎందుకు ప్లాన్ చేసుకున్నారన్న ప్రశ్న తెలంగాణ రాజకీయవర్గాల్లో మెదులుతోంది.
    
ముందుగా రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని - అనంతరం కొండగట్టు నుంచే యాత్ర ప్రారంభించనున్నట్లు పవన్ చెప్పారు. ఆ తర్వాత తమ కార్యకర్తలతో చర్చలు జరిపి తెలంగాణలో ఎక్కడెక్కడ ఎలా పర్యటన చేయాలన్నది మళ్లీ కొండగట్టు వచ్చి పూర్తి యాత్ర వివరాలను వెల్లడిస్తానన్నారు. కేవలం ప్రజాసమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నానని పాదయాత్రలో ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని ఆయన అన్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమావేశమవుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
     
మరోవైపు యాత్ర ఎలా ఉండబోతుందన్నది కూడా ఆయన చెప్పారు. పాదయాత్ర - బస్సుయాత్ర - రోడ్ షో ఇలా వీలున్న మార్గంలో ప్రజల చెంతకు వెళతానని పవన్ అన్నారు. ప్రత్యేకించి విరామం తీసుకునేది ఉండదని పవన్ అన్నారు. అయితే.. పవన్ ఇప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడానికి కారణమేంటి.. ఈ మూడు రోజుల యాత్ర తరువాత వెంటనే దానికి కొనసాగింపు ఉంటుందా.. లేదంటే మళ్లీ ఎప్పుడో తనకు బుద్ధి పుట్టినప్పుడు మొదలుపెడతారా వంటి అనుమానాలు ఆయన అభిమానుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.