Begin typing your search above and press return to search.

బాబుతో జనసేన డీల్ కుదిరిందా?

By:  Tupaki Desk   |   20 Feb 2019 1:30 AM GMT
బాబుతో జనసేన డీల్ కుదిరిందా?
X
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన జనసేన అధిపతి పవన్ కల్యాణ్.. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు భజనే చేశాడు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలుకు తను పూచీ అని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నాడు. అయితే హామీల అమలు విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా విఫలం అయినా.. పవన్ కల్యాణ్ మాట్లాడలేదు. చంద్రబాబును ప్రశ్నించలేదు. సినిమాలు చేసుకొంటూ ఉండిపోయాడు.

సినిమా కెరీర్ కూడా దెబ్బతిన్నాకా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోపవన్ కల్యాణ్ మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయినట్టుగా కనిపించాడు. అయితే పవన్ ఇప్పుడు కూడా చంద్రబాబును ఏమీ అనడం లేదు. ఆ మధ్య జగన్ నే విమర్శించాడు. అలా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ సాగాడు.

ఇక గత కొన్నాళ్లుగా పవన్ కల్యాన్ కామ్ అయిపోయాడు. అసలు ఊసులో లేడు. అసలు ఎన్నికల ముందు ఇంత సైలెన్స్ ఏమిటి.. అంటే.. ఇదంతా డీల్ మేరకు అనే ప్రచారం జరుగుతూ ఉంది.

ఇప్పటికే జనసేనకు- టీడీపీకి డీల్ కుదిరింది అని.. ఆ ఒప్పందంలో భాగంగానే పవన్ కల్యాణ్ కామ్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. వీలైనంతగా ప్రజా వ్యతిరేక ఓటును చీల్చడమే ఆ డీల్ అని సమాచారం.

ఇప్పుడు జనసేన- టీడీపీలు కలిసి పోటీచేస్తే జనాలు ఇద్దరినీ నమ్మరు. ఇప్పటికే చంద్రబాబును చాలా విమర్శించాడు పవన్ కల్యాణ్. అలాంటిది ఇప్పుడు మళ్లీ బాబుతో చేతులు కలిపితే పవన్ పై కూడా అందరికీ నమ్మకం పోతుంది. అందుకే వేరేగానే పోటీ చేయాలని.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చి తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా వ్యవహరించాలని జనసేన కు బాధ్యతలు అప్పగించాడట చంద్రబాబు నాయుడు. ఈ మేరకు డీల్ కుదిరినట్టుగా ప్రచారం జరుగుతోంది.