గెలుపు లెక్కలు చెప్పేసిన పవన్ కల్యాణ్

Mon Apr 22 2019 11:48:43 GMT+0530 (IST)

మిగిలిన పార్టీలకు తాము భిన్నంగా ఉన్నామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ చెబుతుంటారు. అందుకు తగ్గట్లే ఆయన తీరు ఉంటుందని చెప్పక తప్పదు. దీంతో పార్టీకి లాభం జరుగుతుందా?  నష్టం జరుగుతుందా? అన్న విషయాల్ని పక్కన పెడితే.. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి పార్టీ నేతలతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగిన పది రోజుల తర్వాత అభ్యర్థులు.. నేతలతో భేటీ అయిన ఆయన.. అభ్యర్థుల అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఎన్నికల ఫలితాలపై పవన్ కు ఫుల్ క్లారిటీ ఉందన్న భావన కలుగక మానదు. రాజకీయాల్లో మార్పు మొదలైందని.. ఈ ప్రక్రియను ఇదే రీతిలో కొనసాగిద్దామన్న ఆయన.. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు 120 స్థానాలు వస్తాయమంటే.. టీడీపీ తమకు వచ్చే స్థానాల గురించి లెక్కలు చెప్పింది. మనం మాత్రం అలాంటి లెక్కలు వేయం.. ఓటింగ్ సరళి ఎలా జరిగిందో తెలుసుకోవాలని మాత్రమే పార్టీ నేతలతో తాను చెప్పినట్లుగా పవన్ వెల్లడించారు.

మార్పు చిన్నగా మొదలవుతుందని.. పార్టీ ఎదిగే దశగా అభివర్ణించిన పవన్.. ఈ మార్పు ఎంత వరకూ వెళుతుందో తెలీదని వ్యాఖ్యానించారు. నేను మిమ్మల్ని గుర్తించినట్లే.. మీరు గ్రామస్థాయిలో మంచి నాయకుల్ని గుర్తించండి. వారిని తయారు చేయండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో మార్పును ప్రజల్లోకి తీసుకెళదామన్నారు. తెలంగాణలో కూడా ఇదే తరహా మార్పును ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.

నిధులు.. నియామకాల విషయంలో తేడా వచ్చినప్పుడే ఉద్యమాలు పుడతాయని.. తెలంగాణ ఉద్యమం కూడా అలానే పుట్టిందన్న పవన్.. ప్రతి చోటా రెండు కుటుంబాలే అంతా ఆపరేట్ చేస్తుంటాయన్నారు. మార్పు రావాలంటే ముందు భయపడకూడదన్న పవన్.. అలాంటి మార్పు యువతోనే సాధ్యమన్నారు.

ఎన్నికలు లేని సమయంలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం పని చేద్దామన్నారు. చూస్తుంటే.. తాజా ఎన్నికల ఫలితాలు తమకు ఏ మాత్రం ఆశాజనంగా ఉండదన్న విషయాన్ని పవన్ తన మాటల్లో పరోక్షంగా చెప్పేశారని చెప్పాలి. ఎన్నికలు లేని వేళ కూడా ప్రజల్లో ఉండి వారి సమస్యల మీద దృష్టి పెట్టాలంటున్న పవన్.. ఆ విషయంలో పార్టీ నేతల కంటే ముందు పవన్ ఆచరిస్తే బాగుంటుదేమో?