పవన్ కు మళ్లీ దొరికిపోయిన బాబు - లోకేష్

Fri Nov 09 2018 09:36:04 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు - ఆయన తనయుడైన మంత్రి లోకేష్ తీరును మరోమారు జనసేన అధ్యక్షుడు - సినీనటుడు పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దును అటు చంద్రబాబు - ఇటు లోకేశ్ స్వాగతించారని తాము మాత్రమే వ్యతిరేకించామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పలు ఆధారాలను పేర్కొంటూ వారకి కౌంటర్ ఇచ్చారు. గతంలో చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాల వీడియోలు - తను చేసిన కామెంట్లకు వచ్చిన మీడియా కవరేజీ వివరాలను పేర్కొంటూ...నరేంద్ర మోడీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఉన్నారనే టీడీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
 
రూ.1000 - రూ.500 నోట్ల రద్దు కారణంగా వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తను ఇచ్చిన ప్రకటనలను - నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ జనసేన చేసిన పోరాటంపై మీడియాలో వచ్చిన కథనాల లింక్స్ ను పంచుకున్నారు.  ``పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని జనసేన అధినేత - సినీనటుడు  అన్నారు. ఈ మేరకు ఆనాడే ట్వీట్ లో తెలిపాను. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగీ - ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచునీ పలువురు మరణించారు. వారి మృతికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేలే కారణం`అంటూ ఆనాటి తన కామెంట్లను పంచుకున్నారు.ఈ సందర్భంగా టీడీపీ నేతల డబుల్ స్టాండర్డ్స్ పై పవన్ మండిపడ్డారు. రెండేళ్ల క్రితం నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినప్పుడు - క్యూ లైన్లో నిలబడి తీవ్ర అవస్థలు పడినప్పుడు తాను మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించానని - అదే సమయంలో నీవు (లోకేష్) - మీ తండ్రి (చంద్రబాబు) మాత్రం బీజేపీ నేతలపై ప్రశంసలు కురిపించారని ఆ పోస్టులో పేర్కొన్నారు. అప్పుడు బీజేపీని సమర్థించింది మీరా.. నేనా అని నిలదీశారు. ఇక్కడ లింక్స్ పెట్టాను కావాలంటే చెక్ చేసుకోండి అన్నారు.  ఈ నోట్ల రద్దు ఐడియా తనదేనని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారనీ - చివరికి ప్రతిపక్ష వైసీపీ కూడా దీన్ని స్వాగతించిందని వెల్లడించారు. ఓవైపు సామాన్యులు కష్టపడి సంపాదించిన తమ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు అల్లాడిపోతుంటే మరోవైపు చంద్రబాబు - లోకేశ్ బీజేపీని బహిరంగంగా సమర్ధించారని దుయ్యబట్టారు.