Begin typing your search above and press return to search.

సీఎం అయినా ఓకే..కాకున్న ఓకే అంటున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   19 March 2017 5:15 AM GMT
సీఎం అయినా ఓకే..కాకున్న ఓకే అంటున్న ప‌వ‌న్‌
X
ప‌వ‌ర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన కొత్త సినిమా ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్‌ కార్యక్రమం సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకింత అనూహ్య‌మై వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజ‌రైన అభిమానులు పవన్‌ సీఎం, సీఎం అంటూ కేరింతలు కొట్టారు. దీనికి ప‌వ‌న్ స్పందిస్తూ "నేను ముఖ్యమంత్రి అయితే మంచిది, కాకుంటే మరీ మంచిది" అని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరుకున్న స్థానంలో ఉండటానికి ఇష్టపడతానని, రేపు ఎక్కడ ఏ స్థాయిలో ఉంటానో వాళ్లే నిర్ణయిస్తారని పవన్‌ అన్నారు. తనకు వీధులు ఊడ్చే పని ఇచ్చినా, హీరోగా నటించమన్నా మరే పని చేసినా సిగ్గుపడకుండా, నిజాయితీగా చేస్తానన్నారు. తాను ఎవరికంటే తక్కువ-ఎక్కువ కాదని, ప్రతి ఒక్కరితో సమానుడిగానే భావిస్తానని పవన్‌ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోని భావాల‌ను మ‌రోమారు పంచుకున్నారు. తాను హీరోనని అనుకోనని ప‌వ‌న్ తెలిపారు. 'నేను ఎంత ఎదిగినా మీలో ఒకడిగానే అనుకుంటాను. నా ఆలోచనా పరిధి ఎంత విస్తృతమైనా, కాళ్లు నేలమీదే ఉండాలని కోరుకుంటాను. నా ప్రతి సినిమా కష్టపడే చేస్తాను' అని ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. ’సినిమాల్లో కథానాయకుడిని కావాలని కోరుకోలేదు. దర్శకుడినో, మరో సాంకేతిక నిపుణుడినో కావాలనుకున్నా. కానీ దేవుడు నన్ను హీరోను చేశాడు. ఈ పేరు ఆయన పెట్టిన భిక్షే అనుకుంటాను. నేను చేసిన సినిమాల్లో చాలా సందర్భాల్లో నా భావాలు కనిపిస్తాయి. ఇది అనుకోకుండా జరిగినా నా మనసులో ఉన్నవే నా పాత్రల్లో కనిపించాయి. ‘గోకులంలో సీత’ లో భోగం వదిలి ప్రేమే సర్వస్వం అనుకునే యోగిలా మారే పాత్ర చేశాను. దీని ద్వారా ప్రేమే సర్వస్వం అనేది చెప్పగలిగాం. ‘సుస్వాగతం’ చిత్రంలో ప్రేమ కోసం అమ్మా నాన్నలను నిర్లక్ష్యం చేయొద్దనే నీతి ఉంటుంది. ఆ సినిమాలో మా నాన్న చనిపోయినప్పుడు ఎంతగానో ఏడ్చాను. షూటింగ్‌ అని తెలిసినా…దు:ఖం ఆపుకోలేకపోయాను. ‘తొలిప్రేమ’లో బాధ్యత లేని ప్రేమ వద్దని చూపించాం. పట్టుదలగా శ్రమిస్తే ఏదైనా సాధించగల మనే నమ్మకాన్ని ‘తమ్ముడు’ సినిమా కలిగించింది. ఆ సినిమాకు ఓ ఉన్మాదిలా కష్టపడ్డాను. చనిపోయినా ఫర్వాలేదనేంత శ్రమించాను. నా నట జీవితంలో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘తమ్ముడు’. నేను ఎవరికీ తక్కువ కాదని ‘బద్రి’ చెబుతుంది. ‘ఖుషీ’ చిత్రంలో నా దేశం అనే ప్రేమ కనిపిస్తుంది. ఇలా నాలోని భావాలే నా సినిమాలు అవడం అదృష్టం. ‘ఖుషీ’ సినిమా ప్రదర్శన చూస్తున్నప్పుడు ఎందుకో కీడు కలగనుందని అనిపించింది. సినిమా మధ్యలోనే బయటకు వచ్చాను. అప్పుడు ఎందుకో బలహీనంగా, నా శక్తి క్షీణించినట్లు అనిపించింది. అప్పుడు కోల్పోయిన బలం మళ్లీ నేను ‘గబ్బర్‌సింగ్‌’ లో పోలీస్‌ స్టేషన్‌ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తిరిగి వచ్చిన భావన కలిగింది.

ఇక తాజాగా చిత్రం గురించి ప‌వ‌న్‌ మాట్లాడుతూ ‘కాటమరాయుడు’కు కష్టపడి ప‌ని చేశాన‌ని అభిమానులు ఈ సినిమాను హిట్‌ చేసినా, ప్లాప్‌ చేసినా దాన్ని మనసారా అంగీకరిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న‌ మానసిక స్థాయి జయాపజయాలకు అతీతంగా స్థిరంగా ఉంటుందని ప‌వ‌న్ వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/