Begin typing your search above and press return to search.

సొంతూర్లో.. సొంతింట్లో ప‌వ‌న్ భావోద్వేగం

By:  Tupaki Desk   |   11 Aug 2018 5:05 AM GMT
సొంతూర్లో.. సొంతింట్లో ప‌వ‌న్ భావోద్వేగం
X
కొన్నింటిని చూస్తే..కాస్తంత సిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. దేశం మొత్తాన్ని ఉద్ద‌రిస్తాన‌నే వాళ్లు.. సొంతింటిని.. సొంతూరిని పెద్ద‌గా ప‌ట్టించుకోని వైనం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సొంతూరు ప‌ట్ట‌నోళ్లు.. మిగిలిన వారిని ఎలా ఉద్ద‌రిస్తార‌న్న డౌట్ రాక మాన‌దు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంగ‌తే చూద్దాం. ఆయ‌న పుట్టింది గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో. తానింత స్టార్ అయ్యాక‌.. తాను పుట్టిన ఊరును ప‌ట్టించుకున్న‌ది లేదు. కానీ.. 2019 ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేప‌ట్టాల‌న్న కాంక్ష‌తో ర‌గిలిపోతున్న ఆయ‌నకు.. ఇప్పుడు తాను పుట్టిన ఊరు గుర్తుకు వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌న గుంటూరులో జ‌రిగిన స‌భ‌ల్లో తాను పుట్టింది బాప‌ట్ల‌లో అని అదే ప‌నిగా ప‌వ‌న్ నోటి నుంచి రావ‌టం క‌నిపిస్తుంది.

అంతేనా.. త‌మ పూర్వీకుల నివాస‌మైన మొగ‌ల్లూరుకు నిన్న (శుక్ర‌వారం) వెళ్లిన ప‌వ‌న్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. వాస్త‌వంగా చూస్తే.. అంత ఎమోష‌న‌ల్ కు గురి కావాల్సిన అవ‌స‌రం లేదు. వాస్త‌వానికి ఆయ‌న ఎమోష‌న్ ను చూసిన కొంద‌రు స్థానికులు షాక్ తిన్నారు.

పూర్వీకుల ఊరి మీద ఇంత భావోద్వేగ‌మే ఉంటే.. ఇంత‌కాలం ఎక్క‌డికి వెళ్లావు ప‌వ‌నా? అంటూ ప్ర‌శ్నించుకున్నోళ్లు లేక‌పోలేదు. ప్ర‌పంచాన్ని ఉద్ద‌రించ‌టానికి బ‌య‌లుదేరిన వ్య‌క్తి ముందు ఊరిని అంతో ఇంతో బాగు చేయాల‌ని భావిస్తారు. కానీ.. ప‌వ‌న్ కానీ.. ఆయ‌న అన్న చిరంజీవి కానీ ఆ విష‌యంలో త‌మ ఊరిగా చెప్పుకునే మొగ‌ల్తూరుకు చేసిందేమీ లేదు.

అలా అని వారేమీ చిన్నా చిత‌కా స్థాయిలో లేరు క‌దా. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి విష‌యంలోనూ ఏదో ఒక భావోద్వేగ లింకును తెర మీద‌కు తీసుకొచ్చి ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అందులో భాగ‌మే ప‌వ‌న్ తాజా మొగ‌ల్తురు ట్రిప్ గా చెప్ప త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ప్ర‌జా పోరాట యాత్ర‌ను చేప‌ట్టిన ప‌వ‌న్‌.. న‌ర‌సాపూరంలోని బ‌హిరంగ స‌భ‌కు ర్యాలీగా బ‌య‌లుదేరారు. అదే దారిలోని భీమ‌వ‌రం నుంచి కోమ‌టితిప్ప‌.. కాళీప‌ట్నం.. ముత్యాల‌ప‌ల్లి మీదుగా త‌మ పూర్వీకుల ఊరు మొగ‌ల్తూరుకు వెళ్లారు.

అక్క‌డి పాత‌కాలువ సెంట‌ర్లో ఒక‌ప్పుడు తామున్న ఇంటిని సంద‌ర్శించారు. ఐదేళ్ల వ‌య‌సులో తాను మొగ‌ల్తూరులో ఉన్నాన‌ని.. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ త‌మ సొంత ఇంటికి రావ‌టం మంచి అనుభూతిని ఇచ్చిందంటూ ఎమోష‌న్ కు గుర‌య్యారు. లాజిక్ గా చూస్తే.. మొగ‌ల్తూరు ఏమీ అక్క‌డెక్క‌డో లేదు. హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర్లోనే ఉంది. మ‌హా అయితే.. ఒక పూట ప్ర‌మాణం. ఇంకా చెప్పాలంటే.. ప‌వ‌న్ లాంటి ప్ర‌ముఖుడికి త‌న పూర్వీకుల ఊరు చూడాల‌నుకున్న ఆలోచ‌న వ‌చ్చిన గంట‌ల్లోనే ఆయ‌న చూసి రావొచ్చు. కానీ.. అందుకు ఏళ్ల‌కు ఏళ్లుగా వీలు కాని వైనం ఒక ఎత్తు అయితే.. ఏళ్ల త‌ర్వాత ఇచ్చి ఎమోష‌న్ కావ‌టం మ‌రో ఎత్తు. మొత్త‌మ్మీదా ఎమోష‌న్ రాజ‌కీయం బాగానే పండింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.