పవన్ వస్తే గుడి తలుపులు మూసేశారు

Wed May 16 2018 12:00:43 GMT+0530 (IST)

త్వరలో ఏపీ రాష్ట్ర పర్యటన కోసం సంసిద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దాని కంటే ముందు దేవుడి అనుగ్రహం కోసం గుళ్ల చుట్టు తిరగటం తెలిసిందే. తిరుమలకు కాలి నడకన వెళ్లి.. స్వామివారి దర్శనం చేసుకున్న పవన్ కల్యాణ్.. తిరుమల.. తిరుపతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్ని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.ఓపక్క గుళ్లను సందర్శిస్తూ.. మరోవైపు స్థానిక పరిస్థితుల్ని పరిశీలించటం.. అభివృద్ధి కార్యక్రమాల్లో చోటు చేసుకుంటున్న తప్పుల్ని ఆయన చూస్తున్నారు. తాజాగా ప్రసిద్ధ దేవాలయం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి పవన్ వెళ్లారు. మొదట ఆలయ ఆవరణలో భూమట్టానికి 32 అడుగుల లోతులో ఉన్న పాతాళ వినాయకుడ్ని దర్శించుకున్న ఆయన.. క్యూ లైన్లో సామాన్య భక్తులతోపాటు వెళ్లి స్వామివారి.. అమ్మవారి దర్శనాలు చేసుకున్నారు.

పవన్ రాకతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి భారీగా తరలివచ్చారు. ఆలయం కిక్కిరిసోయింది. పవన్ కారణంగా పెరిగిన రద్దీ నేపథ్యంలో గుడి తలుపుల్ని మూసేయటం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రముఖులు.. వీవీఐపీలు రావటం మామూలే.

అయితే.. ఇప్పటివరకూ ఎంతటి ప్రముఖుడు వచ్చినా గుడి తలుపులు మూయటం లేదని.. సదరు ప్రముఖుల దర్శనం పూర్తి అయ్యే వరకు దర్శనాన్ని నిలిపి.. తర్వాత సాధారణ భక్తుల్ని వదిలేస్తుంటారు. తాజాగా మాత్రం పవన్ రాకతో గుడి ప్రధాన ద్వారాన్ని మూసిపోయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.  సామాన్యుడి మాదిరి క్యూలైన్లో వెళ్లి పవన్ దర్శనం చేసుకుంటే.. ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసి అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.