Begin typing your search above and press return to search.

తెలంగాణ వద్దు...ఏపీ ముద్దు...

By:  Tupaki Desk   |   14 Sep 2018 4:51 PM GMT
తెలంగాణ వద్దు...ఏపీ ముద్దు...
X
తెలంగాణలో అన్ని పార్టీలు ముందస్తు హడావుడిలో ఉన్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ఏకంగా 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల సమరానికి శంఖం పూరించింది. ఇక మిగిలిన పార్టీలు కాంగ్రెస్ - తెలుగుదేశం - వామపక్షాలు - తెలంగాణ జన సమితి వంటివి పొత్తుల చర్చల్లో ఉన్నాయి. ఎవరికి ఎన్ని ఇవ్వాలి - తాము ఎన్ని తీసుకోవాలని అని సీట్ల లెక్కలు తీస్తున్నాయి. ఇంత హడావుడి జరుగుతున్నా జనసేనాని - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం కిమ్మనడం లేదు.... కిక్కురుమనడం లేదు. ఇదంతా వ్యూహంలో భాగమా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు కాని.... అసలు ఉద్దేశ్యం మాత్రం వేరే ఉందట. అది ఏమిటా అని తలలు పట్టుకోవాల్సిన పని లేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.... తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విపరీతంగా పొగిడేశారు పవన్ కల్యాణ్. తెలంగాణలో పాలన ఎంతో బాగుందని - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పాలన చూసి చాలా నేర్చుకోవాలని కూడా ఓ స్టేట్‌ మెంట్ ఇచ్చేశారు.

అంతే కాదు.... ముఖ్యమంత్రి కల్వకుంట్ల వారిని ప్రత్యేకంగా కలిసి అభినందనల మాల కూడా వేసేశారు. ఇవన్నీ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే కె.చంద్రశేఖర రావు పాలనపై విమర్శలు చేయాల్సి వస్తుందని - అది ఆయనకు ఇష్టం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత కొంతకాలంగా జనసేనతో వామపక్ష పార్టీలు జట్టు కడుతున్నాయి. వీరిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపు నిర్ణయించుకున్నారు. అయితే ఇదంతా తెలంగాణలో కాదు.... ఆంధ్రప్రదేశ్‌ లోనే అంటున్నారట పవన్ కల్యాణ్. తెలంగాణలో వామపక్ష పార్టీలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మహాకూటమిలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును విపరీతంగా పొగిడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మహాకూటమిలో భాగస్వాములైన వామపక్షాలతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తే ప్రజల్లో చులకనైపోతామని పవన్ కల్యాణ్ అంటున్నారట. గతంలో హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగితే తన వద్ద అంత డబ్బు లేదని పవన్ కల్యాణ్ చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏలికకు ముగ్దుడైన పవన్ కల్యాణ్ ముందస్తు ఎన్నికలకు దూరం అవుతున్నారట. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలంటేనే ముద్దు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.