Begin typing your search above and press return to search.

త‌న విమ‌ర్శ‌కుల‌కు ప‌వ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   9 Dec 2017 6:21 PM GMT
త‌న విమ‌ర్శ‌కుల‌కు ప‌వ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు
X
తన పై విమర్శలు చేసేవారికి తనదైన శైలిలోనే జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. `అందరికీ అన్నీ నచ్చాలని లేదు. నాలోని అంశాలు కొందరికి నచ్చుతాయి. మరి కొందరికి నచ్చవు. మనిషి నవ్వితే శరీరంలో కొన్ని భాగాలకు పని చేస్తే చాలు... అదే కోపంగా ఉంటే మాత్రం శరీరం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ప్రతి వ్యక్తికి సహనం ఉండాలి. అయితే అది కూడా కొంత మేర అయితేనే మంచిది` అని ప‌రోక్షంగా త‌న‌ పై వ‌స్తున్న విమ‌ర్శ‌కుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ కౌంట‌ర్ ఇటీవ‌లి కాలంలో త‌న‌ పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌కు కౌంట‌ర్ అని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి కాదు అజ్ఞాన‌వాసి అని, ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన కాదు కాపు సేన అని క‌త్తి మ‌షేష్ కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. వీటికి ప‌రోక్ష రీతిలో అన్న‌ట్లుగా తాజాగా ఆయ‌న కౌంట‌ర్ ఉందంటున్నారు. `ఎవరైనా బలమైన గొంతును వినిపిస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నేను బంగారాన్ని కాదు...నేను కూడా మనిషినే. ఇష్టంలేని పని చేస్తుంటే సహనం పేరుతో చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. అయితే అవసరమైన సందర్భాల్లో వాటికి అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది` అని ప‌రోక్షంగా త‌న అభిమానుల‌కు ప‌వ‌న్ సూచ‌న‌లు ఇచ్చారు. ఓ మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఆ ఆశయాలు మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించాలనే ఆలోచనతో జనసేన పెట్టానన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఒకరికి వస్తే కోపం.. పదిమందికి వస్తే ఉద్యమం' అని సినిమాలోని డైలాగుని ఉదహరించారు. భావితరాలకు మంచి చేయాలన్న తలంపుతోనే జనసేన ఆవిర్భవించిందన్నారు.

తాను వివేకానందుడిని స్ఫూర్తి గా తీసుకుని పెరిగానని ప‌వ‌న్ వెల్ల‌డించారు. వివేకానందుడి అక్షరాలను - ఆశయాలను అభినందించడమే కాకుండా ఆయన బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లు షబ్బీర్ అలీ, దానం నాగేందర్‌లు కూడా తిడతారని, కానీ, ఎక్కడైనా ఎదురుపడితే చాలా బాగా మాట్లాడుకుంటామని చెప్పారు. తాను కూడా ఎందరినో ఏదేదో అంటుంటానని, ఆ తర్వాత వారితో మాట్లాడుతూనే ఉంటానని పవన్ చెప్పారు. ఎందుకంటే, అది క‌నీస మ‌ర్యాద‌ అని ప‌వ‌న్ వివ‌రించారు. ఇదిలాఉండ‌గా...సమావేశం మధ్యలో పవన్‌ను ఉద్దేశించి కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన పవన్‌.. మీరు సీఎం అనగానే అయిపోనని.. దానికి తాను పొంగిపోనని.. సీఎం కావడానికి చాలా అనుభవం కావాలని స్పష్టం చేశారు.