పవనా.. ముక్కలయ్యే శాపాలేంది..?

Mon Nov 05 2018 11:16:51 GMT+0530 (IST)

పవన్ పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది. ఎప్పటికప్పుడు శీల పరీక్ష చేసుకోవాల్సి వస్తోంది. మనిషి మంచోడే కానీ.. కాస్త తేడానే బాబు అన్నట్లుగా ఆయనపై కొందరు చేసే వ్యాఖ్యలకు పవన్ హర్ట్ అవుతుంటారు. కానీ.. తాను హర్ట్ కావటమే చూసుకునే పవన్.. తన కారణంగా కూడా పలువురు హర్ట్ అవుతారన్న విషయాన్ని మర్చిపోతుంటారు.ఇంతకూ విషయం ఏమంటే.. ఇప్పుడు పవన్ కో పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయనకు టీడీపీతో రాంరాం అయ్యాక.. మరో స్నేహితుడు మోడీకి క్లోజ్ గా ఉన్నారన్నది ఆరోపణ. అప్పట్లో పాచిపోయిన లడ్డూలంటూ వెంకయ్యను ఒక రేంజ్లో ఏసుకున్న పవన్.. ఆ తర్వాత నుంచి బీజేపీ మీద పెద్దగా మాటల తూటాల్ని ప్రయోగించని పరిస్థితి. దీంతో.. ఆయనపై పలు సందేహాలు.

చిత్రమైన విషయం ఏమంటే.. పవన్ కు ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తుందో అర్థం కాదు. తాజాగా ఆయన యూపీ నాలుగు ముక్కలు అయిపోగాక అంటూ శపించారు. అదేమంటే.. అంత పెద్ద రాష్ట్రం చూసుకొనే కదా బీజేపీకి పొగరు అని అనేస్తున్నారు. బీజేపీ మీద కోపం యూపీ వాళ్ల మీద చూపించాల్సిన అవసరం ఏముంది?

కావాలంటే బీజేపీ పది ముక్కలైపోవాలి.. మోడీ వ్యతిరేకులంతా ఒక జట్టు కట్టాలి?  అర్జెంట్ గా మోడీని కుర్చీ దిగేలా చేయాలి.. ఇలా శాపనార్థాలు పెట్టాలి కానీ.. తెలుగు రాష్ట్రం ముక్కలైంది కాబట్టి మరో రాష్ట్రం కూడా అలా కావాలని కోరుకోవటం ఏమిటి పవనా? అన్నది ప్రశ్న.

అంతేనా.. అప్పుడెప్పుడో ఒక ఓటు.. రెండు రాష్ట్రాలని బీజేపీ అన్నదని.. దాన్ని ఎవరూ ప్రశ్నించలేదని విరుచుకుపడే పవన్.. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానన్న విషయాన్ని మర్చిపోకూడదు. అర్థం లేని ఆవేశం ఎంత అనర్దమో.. సరైన ఆలోచన లేని మాటలు కూడా అంతే చేటు చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం కష్టాలు పడుతున్నాం కాబట్టి.. ఎదుటోళ్లు కూడా కష్టాలు పడాలనుకోవటం.. శాపాలు పెట్టటం సరైనది కాదు.

ఇంతకాలం రీల్ హీరోలా విలన్ భరతం పట్టిన పవన్.. రియల్ లైఫ్ లోనూ ఏపీకి నష్టం చేస్తున్న వారు.. అన్యాయం చేస్తున్న విలన్స్ ను వ్యూహాత్మకంగా చిత్తు చేయాలే తప్పించి.. ఆవేశంతో మైకు ముందుకు వచ్చి యూపీ.. నాలుగు ముక్కలైపోయాలి.. బీహార్ మూడు ముక్కలు కావాలని అనుకోవటం సరైంది కాదు.

ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇలాంటి పనికిమాలిన శాపాలు పెట్టే కన్నా.. ఆంధ్రోళ్లకు ఉపయోగం కలిగేలా మాట్లాడితే మంచిది. ఇంతకీ.. పవన్ ఈ తీరులో శాపాలు ఎందుకు పెడుతున్నట్లు అన్నది చూస్తే.. ఆయన వెనుక మోడీ ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో అదేమీ లేదన్న దానికి పడే అవస్థల్లోనే ఈ శాపాల పర్వంగా చెప్పాలి. నేను మోడీ మనిషిని కాదన్న మాటను చెప్పేందుకు పచ్చగా ఉన్న రాష్ట్రాలు ముక్కలు కావాలనుకోవటం మంచిది కాదు పవనా?