Begin typing your search above and press return to search.

మొదటి రీలు.. చివరి రీలుతో చితక్కొట్టేశాడా?

By:  Tupaki Desk   |   27 Aug 2016 5:45 PM GMT
మొదటి రీలు.. చివరి రీలుతో చితక్కొట్టేశాడా?
X
భారీ అంచనాల మీదున్న సినిమా విడుదలైనప్పుడు మొదటి సీన్ మీద ఉండే అంచనాలు అన్నీఇన్నీ కావు. నిజానికి ఎంట్రీతోనే సినిమా మీద ఒక అభిప్రాయానికి వచ్చేసే అభిమానులు ఎందరో ఉంటారు. ఒకవేళ మధ్యలో కాస్త బోర్ కొట్టినా క్లైమాక్స్ అదిరిపోతే.. ఆ జోష్ లో మధ్యలో పడే ఇబ్బందిని లైట్ తీసుకుంటారు. సినిమా విషయంలోనే అలా ఉంటే.. తమ అభిమాన హీరో నేరుగా జనాల మధ్యకు వచ్చి మాట్లాడుతుంటే మురిసిపోయేవారెందరో.

అందుకేనేమో.. తన ఎంట్రీ.. ఫినిషింగ్ టచ్ విషయంలో పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా పవన్ ప్రసంగ శైలి ఉందని చెప్పాలి. మొదట చిన్న గాలిగా షురూ చేసి.. తుఫాను మాదిరి స్పీచ్ ఇవ్వటం ఒక పద్దతి. అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ తన స్పీచ్ ను మొదలు మొదలే.. పీక్ స్టేజ్ కు తీసుకెళ్లిన వైనం కాస్త కొత్తగా ఉందనే చెప్పాలి. షెడ్యూల్ సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఆయన.. వేదిక మీదకు రావటం రావటమే భారీ డైలాగ్ తో ప్రసంగాన్ని మొదలు పెట్టేశారు. ఆ జోరు అదే విధంగా కొనసాగిందా? అంటే లేదనే చెప్పాలి.

ఎలాంటి పరిచయ వ్యాక్యాలు లేకుండా నేరుగా పాయింట్ లోకి వచ్చేసి.. ‘‘విల్లు నుంచి వదిలిన బాణం.. నోటి నుంచి వచ్చిన మాటా వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏమి మాట్లాడినా ఒకటికి రెండుసార్లు ఆలోచంచే మాట్లాడతా’’ అంటూ ప్రశ్నించే పవన్ కల్యాణ్ ప్రశ్నించటం మానేశాడే అంటూ తన మీద తరచూ వినిపించే విమర్శకు సమాధానం చెప్పినట్లుగా ఆవేశంగా వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే.. సభ మొదలు పెట్టిన దాదాపు పది.. పన్నెండు నిమిషాల అనంతరం తన ప్రసంగంలో హడావుడి మాటలు కాస్త తగ్గిన వేళలో సభకు విచ్చేసిన వారందరికి ధన్యవాదాలు చెబుతూ.. రోటీన్ డైలాగులు వినిపించారు.

నిజానికి ఇలాంటివి మొదటే వినిపిస్తుంటారు రాజకీయనాయకులు. అందుకు భిన్నంగా పవన్ ఎంట్రీ అదిరిందనే చెప్పాలి. ఆవేశంతో విరుచుకుపడేలా కీలక వ్యాఖ్య చేసినా.. అంతలోనే సర్దుకున్నట్లుగా తన ప్రసంగాన్ని మధ్యమధ్యలో ఆపిన వైనం కానీ.. ఆకట్టుకునే డైలాగుల్ని చెప్పిన తర్వాత మౌనంగా ఉండటం లాంటివి పవన్ ప్రసంగంపై ఆసక్తిని తగ్గించాయని చెప్పాలి. కానీ.. ఈ లాగ్ ను మొత్తంగా మర్చిపోయేలా ఆయన క్లైమాక్స్ సీన్లో పండించిన ఆగ్రహం సీమాంధ్రులకు భావోద్వేగానికి గురి చేయటమే కాదు.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేయటంలో సక్సెస్ కావటమే కాదు.. చివర్లో ఒక స్లోగన్ (పోరాడదాం.. పోరాడదాం.. విజయం సాధించే వరకూ పోరాడటమే ) సభికుల్ని మాత్రమే కాదు.. టీవీల్లో పవన్ ప్రసంగాన్ని ఫాలో అయిన వారంతా ఒక్కసారిగా పొంగిపోయే చేసిన పరిస్థితి. మొదట్లో అదరగొట్టేసి.. మధ్యలో బోర్ కొట్టేసి.. చివర్లో మాంచి ఊపును.. ఒంట్లో ఆవేశాన్ని నింపేలా చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. పవన్ ప్రసంగంలోని మొదటి.. చివరి రీళ్లు చితక్కొట్టేశాయని చెప్పక తప్పదు.