Begin typing your search above and press return to search.

గుడ్‌మార్నింగ్ అంటూ మీడియా పెద్ద‌కు ప‌వ‌న్ షాకులు

By:  Tupaki Desk   |   24 April 2018 6:15 AM GMT
గుడ్‌మార్నింగ్ అంటూ మీడియా పెద్ద‌కు ప‌వ‌న్ షాకులు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గడచిన రెండు మూడు రోజులుగా తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుసగా పోస్టులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. త‌ను టార్గెట్ చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించిన మీడియా సంస్థ‌లైన‌ ఏబీఎన్‌, టీవీ9 దిగ్గ‌జాల‌పై ప‌వ‌న్ విరుచుకుప‌డుతున్నారు. ఇదే రీతిలో నిన్న ఏబీఎన్ అధిప‌తి ఆర్కే, అంత‌కుముందు టీవీ9లో మెజార్టీ వాటాలున్న శ్రీ‌నిరాజుపై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా తాజాగా టీవీ9 ఇమేజ్‌గా చెప్పుకొనే ర‌విప్ర‌కాశ్‌ పై ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్లు పెట్టారు. గ‌తంలో రవిప్రకాశ్ పూజలు చేసిన ఫొటోల‌ను ఈ ఉద‌యం పోస్ట్ చేసిన ప‌వ‌న్ 'రవి గుడ్ మార్నింగ్.. మీరు దేవుడిని, పూజలను కూడా నమ్ముతారే' అని త‌న ట్విట్ట‌ర్ యుద్ధాన్ని ప‌వ‌న్ ప్రారంభించారు.

రవిప్రకాశ్‌కు బహిరంగ లేఖ అంటూ త‌న ట్వీట్ల దాడిని కొన‌సాగించారు. `ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడ‌తావేంవోయ్‌` 'జైలు జీవితం వరమే' - 'నేను ఉన్మాదిని ఏమిట్రా' - 'ఫ్యాక్షన్ - ప్రాంతం - కులం' అంటూ ఒకే ట్వీట్లో మరో మూడు పోస్టులు పెట్టారు. అంతేకాకుండా త‌న పోస్టుల‌కు వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. `మీడియాలో నీలాంటి వ్యక్తులు తప్పులు - అవమానాలు ఏ ఛానల్లో చూపించరు. ఏ పత్రికలో రాయరు. ఇప్పుడు సామాన్యుడి ఆయుధం సోషల్ మీడియా. దాని ద్వారానే నీ అవినీతి అంతర్జాతీయస్థాయి మోసపూరిత వార్తలు ప్రజలకు సాక్షాలతో చూపించాను. మీ 9 గంటల షోలో ఈ ఆర్టికల్స్ వేయి. మామీద మాత్ర‌మే దాడి ఎందుకు? మేం ఎదురుదాడి చేయ‌డం లేద‌నేగా? మీ టీవీ9 అందరికీ సమన్యాయం చేస్తుందని భావిస్తే వీటిని కూడా మీ షోలో వేయాలి.` అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగానే ప‌వ‌న్ మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాలని తెలంగాణ పోలీసులను కోరనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్ర‌క‌టించారు. దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు - రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు ఇలా అందరూ బయటకు వస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలోని కుళ్లు కూడా బయట పడుతుందన్నారు. ఈ దెబ్బతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు - మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా అమరావతి వైపు దారి తీస్తుందంటూ ప‌వ‌న్‌ సంచలన ట్వీట్ చేశారు. దీనికి కొన‌సాగింపుగా..త‌నెందుకు ఇంత ఆగ్ర‌హంగా రియాక్ట్ కావాల్సి వ‌స్తుందో ప‌వ‌న్ వివ‌రించారు. `మీరంతా కలిసి నడిరోడ్డుపై ఓ సోదరి బట్టలు విప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని షోలకు అది కారణమైంది` అంటూ త‌న ఆవేశానికి కార‌ణం వివ‌రించారు.

చివ‌ర‌గా ప‌వ‌న్ ఓ సుప్ర‌సిద్ధ‌మైన సందేశంతో ముక్తాయించారు. తానెప్పుడూ నిస్వరుడిని, నిస్సహాయుడినేనంటూ, మార్టిన్ నైమోలర్ కోట్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "తొలుత కమ్యూనిస్టుల కోసం వారు వచ్చారు. కమ్యూనిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తరువాత సోషలిస్టుల కోసం వారు వచ్చారు. సోషలిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తదుపరి వర్తక సంఘాల కోసం వారు వచ్చారు. వర్తక సంఘాల వ్యక్తిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఆపై యూదుల కోసం వారు వచ్చారు. యూదుడిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఆ తరువాత నా కోసం మాట్లాడాల్సి వచ్చేవరకు ఒక్కరు కూడా మిగల్లేదు" అన్న వ్యాఖ్యలున్న పోస్టర్ ను పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.....