చినబాబుపై పవన్ పవర్ పంచ్!

Thu May 17 2018 13:22:51 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు.. ఏపీ మంత్రి లోకేశ్ మీద మరోసారి పవర్ ఫుల్ ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన పవన్.. ఈసారి మాత్రం పరోక్షంగా విరుచుకుపడటం గమనార్హం.తిరుమలకు కాలినడకన వెళ్లిన పవన్.. ఆ తర్వాత నుంచి తిరుపతి చుట్టుపక్కల పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయాలు.. ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్న వపన్.. చిత్తూరుజిల్లా శెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూసేకరణను తీవ్రంగా తప్పు పట్టారు. టీడీపీ సర్కారు అవినీతిని ఎండగడతామని.. ప్రజల సహకారంతో ప్రభుత్వంపై తిరగబడతామన్నారు. శెట్టిపల్లి గ్రామంలోని రైతులకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా.. వారి భూముల్ని స్వాధీనం చేసుకోవటాన్ని పవన్ తప్పు పట్టారు.

ఈ సందర్భంగా బాబు సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్..టీడీపీలో వేల కోట్లు దోచేసే తెలివి ఉన్న ముఖ్యనేతలకు.. ఆరు వందల ఎకరాలు కాపాడే తెలివితేటలు లేవా? అని ప్రశ్నించారు. సంపన్నులకు ఒక న్యాయం.. రైతులకు మరో న్యాయమా? అని సూటిగా ప్రశ్నించిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి కోసం.. సుస్థిరమైన సర్కారు వస్తుందన్న ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

కానీ.. అది భ్రమేనన్న విషయం తనకు తెలిసిందన్నారు. రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారని.. ఇప్పుడు వారి భూములు లాక్కుంటుంటే.. తాము ఎందుకు తిరగబడకూడదని ప్రశ్నించారు. తన పార్టీకి అన్యాయం చేస్తే వేరే రకంగా పరిష్కరించుకుంటానన్న ఆయన.. ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం తాను రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తానని హెచ్చరించారు. లోకేశ్ అవినీతిపై పవన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు చూస్తే.. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువ కావటం ఖాయమంటున్నారు.