సొంత అడ్డాలో బాబుకు పవన్ దెబ్బ?

Mon Apr 23 2018 13:24:53 GMT+0530 (IST)

ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అర్థం కాని రీతిలో వ్యవహరించటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అలవాటు. సినీ రంగంలో కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ.. ఆయన ఎవరికి ఒక పట్టాన అంతుచిక్కని రీతిలో కనిపిస్తుంటారు. ఆయనకు కొంచెం తిక్క అని.. ఎప్పుడెలా ఉంటారో తెలీదని.. ఆయన మూడ్ ను తట్టుకోవటం కష్టమని.. ఆయనకు టెంపర్ ఎక్కువన్న నెగిటివ్ వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి.అదే సమయంలో తన దగ్గరకు సాయం కోసం వచ్చే వారిని ఉత్త చేతులతో పంపరని.. సెట్లో హీరోయిన్ల పట్ల చాలా మర్యాదగా ఉండటమే కాదు.. తన చిత్రంలో పని చేసే సిబ్బంది ఎవరూ కూడా మహిళల పట్ల చులకనగా చూస్తే కర్రతో బాదేసే తత్త్వం ఆయనలో ఎక్కువని చెబుతారు. సింఫుల్ గా ఉండటం.. డౌన్ టు ఎర్త్ మాదిరిగా ఉండటంతో పాటు సిగ్గరిగా చెబుతారు. ఆయనలో మంచిని.. చెడును విశ్లేషించేటప్పడు సంబంధం లేనట్లుగా అంశాలు కనిపిస్తాయి.

ఇదే.. పవన్ ను అభిమానించే వారు దేవుడిగా.. ఆయన్ను వ్యతిరేకించే వారు ఆయన్ను శాడిస్ట్ మాదిరి.. పిచ్చోడి మాదిరి జమ కడుతుంటారు. ఈ రెండు విషయాన్ని పక్కన పెట్టి పవన్ ను సాపేక్షంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అధినేతల్లో ఎక్కువ పుస్తకాలు చదవటం.. ఎక్కువ మానవత్వంతో ఉండటం.. డబ్బు మీద ఎక్కువ ఆశ లేని నేతల్లో పవన్ ముందుంటారని చెబుతారు. రాజకీయం చేస్తున్నా.. పవర్ కోసం పాకులాడని తీరు ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒకవిధంగా చూస్తే.. మంచితనం ఉన్నప్పటికీ.. మూడ్స్ కు ఆధారంగా వ్యవహరించం పవన్ శాపంగా చెబుతారు.

విపరీతమైన భావోద్వేగంతో వ్యవహరించే పవన్.. మనసుకు తోచినట్లు అప్పటికప్పుడు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి చెబుతూ.. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఒకసారి తన వార్డ్ రోబ్ లో ఉన్న బట్టలన్నీ తీసేసి.. నాలుగు జతలే ఉంచుకున్నాడు. ఎందుకిలా అంటే.. ఎక్కువ బట్టలు ఉంటే.. ఎప్పుడేం వేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఉండేది నాలుగు జతలే ఉంటే.. ఎంపిక చాలా ఈజీగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు ఉండవని చెప్పటాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి తత్త్వం రాజకీయాలకు సూట్ కాదు. ఎందుకంటే.. తనకు అనిపించింది తడవే చేసేయటం రాజకీయాల్లో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నది మర్చిపోకూడదు. కానీ.. ఆ విషయాన్ని పవన్ కు చెప్పి.. ఆయన్ను కంట్రోల్ చేసే వారు ఎవరూ లేరు. దైవసమానమైన తన అన్న చిరు మాటనే వినిపించుకోని పవన్.. తాను డబ్బులిచ్చి పెట్టుకున్న మీడియా సలహా సిబ్బంది మొదలు.. ఆయనంటే పడి చచ్చేంత ఇష్టంతో ఏళ్లకు తరబడి ఉచితంగా సేవలు అందిస్తూ.. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించని వారూ ఉన్నారు. అలాంటి వారెవరూ పవన్ చేసే తప్పుల్ని ఎత్తి చూపించలేరు.

పవన్ చుట్టూ ఉన్న వాళ్లే కాదు.. పవన్ విపరీతంగా అభిమానించే వారు సైతం  పవన్ కు సలహాలు చెప్పే ప్రయత్నం చేయరు. దీనికి కారణం కొన్ని విషయాల్లో ఆయన ఎవరి మాట వినకపోవటమే. ఈ తత్త్వమే పవన్ ను చాలామందిని చాలా రకాలుగా అనుకునేలా చేస్తుంటుంది. కొందరికి పవన్ మిస్టరీయస్ గా కనిపిస్తే.. మరికొందరికి దుందుడుకు స్వభావం ఉన్నోడిగా.. ఆయన ప్రత్యర్థులకు పిచ్చోడి మాదిరి కనిపిస్తారు.

ఆయన్ను అభిమానించే వారు పవన్ ను ప్రకృతితో పోలుస్తుంటారు. ఉరుము ఉరిమేటప్పుడు.. మేఘం గర్జించేటప్పుడు.. గాలి విరుచుకుపడేటప్పుడు ఏం జరుగుతుంది?  దాని వల్ల లాభం ఎంత?  నష్టం ఎంత? అన్న లెక్కలు వేసుకోదు. అలానే పవన్ కూడా. తాను చేస్తున్నదంతా మంచి అయినప్పుడు అందుకు వెనుకా ముందు ఆలోచించటం.. శషబిషలకు అవకాశం ఇవ్వరని చెబుతుంటారు.

ప్రకృతి లాంటి పవన్ ను అర్థం చేసుకోవటంలో చేతకాని వారంతా ఆయన్ను నానా మాటలు అంటారని చెబుతారు. ఆయన్ను విపరీతంగా అభిమానించేవారు ఇన్ని మాటలు చెబుతున్నా.. పవన్ చేసే పనులు మాత్రం కొన్ని అస్సలు అర్థం కానట్లుగా ఉంటాయి. పవన్ ట్వీట్లను చూస్తే.. సీక్వెన్స్ మిస్ అవుతూ ఉంటుంది. తనకు తోచింది చప్పున చెప్పేయటమే తప్పించి.. ఒక ఆర్డర్ అన్నది అస్సలు కనిపించదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్లలో ఒక అంశం టీడీపీ అధినేత మొదలు.. ముఖ్యనేతలకు వణుకు పుట్టించేదిగా చెప్పాలి.

బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో తన నాలుగు రోజుల పర్యటనకు సంబంధించిన వివరాల్ని ఈ రోజు సాయంత్రం లోపు వెల్లడిస్తానని చెప్పారు. ఈ నెల 30న తిరుపతిలో బాబు భారీ ఎత్తున దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. సరిగ్గా అదే రోజున బాబు సొంత జిల్లాలోనే పవన్ ఏదైనా కీలక కార్యక్రమాన్ని ప్రకటిస్తూ.. దీక్ష మీద నుంచి మీడియాతో పాటు.. జనాల్ని కూడా డైవర్ట్ కాక తప్పదు. ఒక పెద్ద ప్రోగ్రాం ఉన్నప్పుడు మీడియా ఒక దానికే ఫోకస్ చేస్తుంటుంది.కానీ.. ఒకే రోజు రెండు పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు రెండింటిని కవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీడియాతో పవన్ చేస్తున్న వార్ నేపథ్యంలో.. ఆయన కార్యక్రమాల్ని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛానళ్లు.. పత్రికలు మరింత ఒళ్లు దగ్గర పెట్టుకొని కవర్ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే.. బాబు కోరుకునే భారీ మైలేజ్ మిస్ కావటం ఖాయం. మరి.. బాబును ఇబ్బంది పెట్టేలా.. ఆయన ఆశల సౌధాల్ని కదిలేలా పవన్ ప్రకటన ఉండేవీలుందన్న మాట బలంగా వినిపిస్తుంది. మరి.. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.