Begin typing your search above and press return to search.

రైతు సూసైడ్ పై బాబును నిలదీసేది అలానా ప‌వ‌న్?

By:  Tupaki Desk   |   21 Feb 2019 8:06 AM GMT
రైతు సూసైడ్ పై బాబును నిలదీసేది అలానా ప‌వ‌న్?
X
రాజ‌కీయం అన్నాక త‌ర‌.. త‌మ బేధాలు అస్స‌లు ఉండ‌వు. రాజ‌కీయాలు మ‌హా క‌ర‌కుగా ఉంటాయి. ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో జాలి.. అయ్యో పాపం అన్న మాట‌కు తావే ఉండ‌దు. మ‌రి.. అలాంటి రాజ‌కీయాలు న‌డుస్తున్న వేళ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తీరు ఇప్పుడు సందేహాస్ప‌దంగా ఉండ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ విష‌యంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. గ‌డిచిన కొద్ది నెల‌లుగా కామ్ కావ‌టం.. ఆచితూచి అన్న‌ట్లు స్పందించ‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2014లో బాబుతో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ప‌వ‌న్.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల్లో నేరుగా పోటీ చేయ‌లేదు. కాకుంటే.. కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొన్నారు.

బాబు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత మిత్ర‌పక్షంగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. ప్ర‌భుత్వ విధానాల్ని త‌ప్పు ప‌ట్టేవారు. కొన్నింటి విష‌యంలో వెన‌కేసుకొచ్చేవారు. ఇదిలా ఉంటే.. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా బాబుపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌.. గ‌డిచిన రెండు.. మూడు నెల‌లుగా కామ్ గా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా గుంటూరు జిల్లా కొండ‌వీడు గ్రామానికి చెందిన అన్న‌దాత ఒక‌రు పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం రాజ‌కీయ క‌ల‌క‌లాన్నిరేపింది.

ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. ప్ర‌భుత్వం.. అధికారుల తీరును త‌ప్పు ప‌డుతూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ రైతు మృతిపై ప‌వ‌న్ స్పందించిన తీరు ఇప్పుడు కొత్త ప్ర‌శ్న‌ల్ని తెర మీద‌కు తెస్తోంది. రైతుమృతిపై ప్ర‌భుత్వం బాధ్య‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఆ విష‌యాన్ని సూటిగా కాకుండా స్మూత్ గా చెప్ప‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు పార్టీ నేత‌ల్ని పంపిన ప‌వ‌న్‌.. ట్విట్ట‌ర్ లో రైతు క‌న్నీరు దేశానికి మంచిది కాద‌న్న సింఫుల్ ట్వీట్ కే ప‌రిమిత‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో రైతు ఆత్మ‌హ‌త్య‌పై ఏపీ విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు మృతిపై మెజిస్టీరియ‌ల్ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ విధానాలు.. అధికారుల వేధింపుల్ని త‌ట్టుకోలేక‌నే రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా ఆరోప‌ణ చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు పొలంలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌టం.. అదే జ‌రిగితే పంట‌కు న‌ష్ట‌మ‌ని వేడుకున్న‌ప్ప‌టికీ అధికారులు ప‌ట్టించుకోలేద‌ని.. దీంతో ఆందోళ‌న‌కు గురైన స‌ద‌రు రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ వాద‌న నిజ‌మైన ప‌క్షంలో రైతు ఆత్మ‌హ‌త్య‌కు బాబు స‌ర్కారు నైతిక బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

ఇంత‌టి సీరియ‌స్ అంశాన్ని ప‌వ‌న్ సింఫుల్ గా తీసుకోవ‌టం.. బాబు స‌ర్కారు తీరు స‌రిగా లేద‌న్న విమ‌ర్శ‌ల్ని ప‌ట్టించుకోకుండా.. చూసి చూడ‌న‌ట్లుగా రైతు ఆత్మ‌హ‌త్య మీద స్పందించామంటే స్పందించామ‌న్న రీతిలో రియాక్ట్ అయ్యారే కానీ.. ప‌వ‌న్ ఎలాంటి సీరియ‌స్ కామెంట్లు చేయ‌క‌పోవ‌టంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని విమ‌ర్శించే విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేయటం వెనుక అస‌లు కార‌ణం ఏమిటంటారు ప‌వ‌నా?