పవన్ కల్యాణ్ ఇకనైనా తేల్చవా నువ్వు

Mon Feb 18 2019 11:27:24 GMT+0530 (IST)

రాజకీయాల్లో దూకుడు ఉండాలి. ప్రత్యర్థి ఒక ఎత్తు వేసేలోపే ఆ ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి. అలాంటప్పుడు విజయం వరిస్తుంది. కానీ ఈ సూత్రం తెలీని పవన్ నింపాదిగా పని చేసుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే టీడీపీ - వైసీపీ సర్వం సిద్ధంగా ఉన్నాయి. బయటకు చెప్పడం లేదు కానీ దాదాపుగా 80 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా ఫిక్సైపోయారు. కానీ జనసేనాని మాత్రం ఎక్కడ వేసిన గొంగొళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాడు.జనసేన తరపున ఎవరు - ఎక్కడ పోటీ చేయాలి అనుకునేవాళ్లు ముందుగా అప్లికేషన్ పెట్టాలి. ఈ అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత జనసేన ఎన్నికల కమిటి.. సాధ్యాసాధ్యాలు - అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ గమనించి సీటు కేటాయిస్తుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నిన్నే మొదలైంది. మొదటగా పవన్ అప్లికేషన్ పెట్టాడు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ అప్లికేషన్ సమర్పించారు. ఇక పవన్ ఎక్కడనుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రం అప్లికేషన్ లో పొందు పర్చలేదు.

 ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటే.. వాటిని ఎప్పుడు స్క్రూటినీ చేస్తారు - అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారు. ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. మిగిలిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ టైమ్ లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి పోయి ఇంకా అప్లికేషన్లు ఏంటి అని విమర్శలు విన్పిస్తున్నాయి. ఇలా అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందనే కామెంట్లు కూడా విన్పిస్తున్నాయి.