పవన్ ఓట్ల చీలిక.. ఏపీలో ఎవరికి లాభం..?

Mon May 14 2018 12:44:36 GMT+0530 (IST)

తెలంగాణలో రాజకీయాలు చప్పగా సాగుతున్నాయి. కేసీఆర్ సంక్షేమ పథకాలతో సాగిపోతుండగా.. కాంగ్రెస్ నాయకులు అడపాదడపా సభలతో ఊరడిస్తున్నారు. కానీ ఏపీ పరిస్థితి పూర్తి భిన్నం.. కార్చిచ్చు లాంటి ఎండల్లో జగన్ పాదయాత్రతో ప్రజలకు చేరువవుతున్నారు. మరోవైపు తిరుమల వెంకన్నకు మొక్కులు మొక్కి బస్సుయాత్రకు పవన్ సిద్ధమవుతున్నారు. ఈ రెండు యాత్రలు ఏపీలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం ఏ యాత్రలు చేసే పరిస్థితుల్లో లేరు.. మొన్నీ మధ్య ప్రత్యేక హోదా ఇవ్వని తీరుకు  నిరసనగా దీక్షలు చేసిన బాబు.. సెంటిమెంట్ ను ఆయుధంగా మలిచి రాజకీయాల్లో ముందుకు పోతున్నారు..ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.. క్రియాశీల రాజకీయాల్లో జగన్ - పవన్ కళ్యాణ్ లు చురుకుగా మారిపోతున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.    పోయిన సారి ఆంధ్రాలో బలంగా ఉన్న సామాజికవర్గమంతా చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచింది. ఇప్పుడు అదే సామాజికవర్గం జగన్ - పవన్ వెంట నడుస్తోంది. అంటే ఆ ఓట్లు వచ్చేసారి చంద్రబాబుకు పడనట్లే.. ఈ నేపథ్యంలోనే పవన్ ఎంట్రీ ఏపీ పాలిటిక్స్ లో ముఖ్యంగా టీడీపీకి చేటు తెచ్చేదే.. జగన్ - చంద్రబాబు మధ్య పోటీలో పవన్ ఓట్లు చీల్చడం ఖాయం.. 2009 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ - టీడీపీ పోటీపడితే మధ్యలో వచ్చిన ప్రజారాజ్యం ఓట్లు చీల్చి టీడీపీని చావు దెబ్బతీసింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా పవన్ వల్ల అదే జరగబోతోంది..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు అంతగా కార్యకర్తలు - నాయకుల బలం లేదు. ఆ విషయం పవన్ కు తెలుసు.. తరచూ జనంలో ఉండకపోవడం కూడా జనసేనానికి మైనస్ గా మారింది. అందుకే రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనివల్ల యువతలో ఆయన సామాజికవర్గంలో బలం పెరుగుతుంది. ఇదే 2019 ఎన్నికల్లో ఓట్ల చీలికకు కారణమవుతుంది. ఈ త్రిముఖ పోరులో చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచిన సామాజికవర్గం పవన్ వెంట వెళుతుంది. ఇది జగన్ గెలుపునకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒంటరిపోరు వైసీపికి లాభం కాగా.. టీడీపీకి తీరని నష్టం.. ఇప్పుడిదే టీడీపీ నేతల్లో కలవరపాటుకు  కారణమవుతోంది.