ఆ రెండు జిల్లాల్లో పవన్ ప్రభావం పది సీట్లలో!

Wed Apr 24 2019 20:40:21 GMT+0530 (IST)

గెలుపు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీల నుంచి హడావుడి చేసే వాళ్లు కనిపిస్తూ ఉన్నారు కానీ జనసేన తరఫు నుంచి ఆ హడావుడి లేదు. తాము మినిమం మెజారిటీ సీట్లను సాధిస్తామని అంటూ ఆ పార్టీ నేత  - విశాఖ అభ్యర్థి లక్ష్మినారాయణ ప్రకటించుకున్నారు. ఇక జనసేన తరఫున ఎన్నికల ముందు బాగా హడావుడి చేసిన అద్దేపల్లి  శ్రీధర్ లాంటి వారు కూడా సైలెంట్ అయిపోవడంతో .. గట్టిగా బల్లగుద్దే వాళ్లు కనిపించడం లేదు.మరి జనసేన ఎన్ని సీట్లను సాధించినా అదంతా సైలెంట్ ప్రక్రియే అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన ఎన్ని సీట్లను గెలుస్తుంది - ఏయే సీట్లను గెలుస్తుంది అనేది ఆసక్తిదాయకంగా మారింది. మొదటి నుంచి జనసేనకు బలం విషయంలో ఉభయ గోదావరి జిల్లాల పేర్లే  వినిపిస్తూ ఉన్నాయి. పవన్ పార్టీ ఎన్ని సీట్లను సాధించినా అక్కడే అనే లెక్కలున్నాయి. అందుకు తగ్గట్టుగా పవన్ ఆ జిల్లాలను దాటి బయట ప్రచారం చేసింది తక్కువే. గోదావరి - ఉత్తరాంధ్ర జిల్లాలను మాత్రమే పవన్ నమ్ముకున్న వైనం స్పష్టం అయ్యింది.

ఇలాంటి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పది-పదకొండు ఎమ్మెల్యే సీట్ల విషయంలో జనసేన ప్రభావం ఉండవచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్ట్ పోలింగ్ ఎనాలిసిస్ లో భాగంగా పది సీట్లలో పవన్ పార్టీ కి బాగానేఓట్లు పడ్డాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వాటి జాబితా ఇలా ఉంది..

తూర్పుగోదావరి జిల్లాలోని.. కొత్తపేట రాజమండ్రి రూరల్కాకినాడ రూరల్ ముమ్మిడివరం రాజోలు తుని.. నియోజకవర్గాల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చిందని సమాచారం. ఈ నియోజకవర్గాల్లో జనసేనకు భారీగా ఓట్లు పడ్డాయని ఈ సీట్లలో ఆ పార్టీ విజయకేతనం ఎగరేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. అక్కడ భీమవరం నరసాపురం తాడేపల్లి గూడెం పాలకొల్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చారని సమాచారం. వీటిల్లో భీమవరం నియోజకవర్గంలో స్వయంగా పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నియోజకవర్గాలన్నింటి విషయంలోనూ కామన్ గా వినిపించే విశ్లేషణ.. వీటన్నింటిలోనూ కాపుల జనాభా గణనీయంగా ఉంది. దానికి తోడు కొన్ని చోట్ల స్థానికంగా బలంగా ఉన్న మరో సామాజికవర్గం అభ్యర్థులకు టికెట్లు దక్కాయి. దీంతో రెండు ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నియోజకవర్గాల్లో కొన్ని లోపాలు - తెలుగుదేశం పై వ్యతిరేకత ఉండనే ఉన్నాయి. ఫలితంగా వీటిల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంచనా.

మరి అసలు కథ ఏమిటనేది.. మే ఇరవై మూడునే తెలిసేది!