పవన్ నియోజకవర్గానికి దారేదీ?

Thu Nov 08 2018 12:21:08 GMT+0530 (IST)

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తరచూ ఏదో ఒక జిల్లాలో తిరుగుతూ హడావుడి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆయనకు అభ్యర్థులు తగినంత మంది దొరకలేదని... ఆయన పోటీ చేయడానికి అనుకూలమైన నియోజకవర్గం కూడా ఏదీ గుర్తించలేకపోయారని టాక్. పవన్ తానెక్కడ పోటీ చేయాలనే విషయంలో తీవ్రమైన గందరగోళంలో ఉన్నారని తెలుస్తోంది. తన సొంత సామాజికవర్గం కాపుల ఓట్లు అధికంగా ఉన్న గోదావరి జిల్లాల్లో పోటీ చేయాలా..? తనకు మంచి క్రేజ్ ఉన్న ఉత్తరాంధ్రలో పోటీ చేయాలా అనే విషయంలో ఆయన క్లారిటీకి రాలేకపోతున్నారట.పవన్ మాటల్లోనూ ఆ అస్పష్టత అనేకసార్లు బయటపడుతోంది. ఒకసారి ఏలూరు నుంచి పోటీ చేస్తానంటారు... ఇంకోసారి ఎస్టీ నియోజకవర్గం అన్న విషయమే మరిచి పాడేరు నుంచి పోటీ చేస్తానని చెప్తారు. మరోసారి తిరుపతి నుండి పోటీ చేయమని తనను ఒత్తిడి పెడుతున్నారంటూ చెప్తారు. వీటన్నిటికంటే ముందు అనంతపురం నుండి పోటీ చేయబోతున్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు. ఇప్పుడు పిఠాపురంలో సభ పెట్టి అక్కడినుంచే పోటీ చేస్తానంటున్నారు.

దీంతో తానెక్కడి నుంచి పోటీ చేస్తాడో నిర్ణయించుకోలేని నేత ఇక మిగతా సీట్లకు అభ్యర్థుల విషయంలో ఇంకెంత పిచ్చెక్కిస్తాడో అని ఆయన పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అయితే... జనసేనను బచ్చాలా చూస్తున్న మిగతా పార్టీలు మాత్రం పవన్ కల్యాణ్‌కు అభ్యర్థులు అస్సలు లేకపోవడంతో అన్ని స్థానాల నుంచి తానే పోటీ చేయాలునకుంటున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.