Begin typing your search above and press return to search.

తెలంగాణ ఉద్య‌మం ప‌వ‌న్‌ కు క్లారిటీ లేదా?

By:  Tupaki Desk   |   22 July 2018 12:30 PM GMT
తెలంగాణ ఉద్య‌మం ప‌వ‌న్‌ కు క్లారిటీ లేదా?
X
తెలంగాణ ఉద్య‌మాన్ని తాను చాలా ద‌గ్గ‌ర నుంచి చూసిన‌ట్లుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్ప‌టం తెలిసిందే. ఉద్య‌మ‌కారుల‌తో తాను మాట్లాడేవాడిన‌ని ఆయ‌న చెప్పటాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అంతేనా.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆవేద‌న త‌న‌ను క‌దిలించేవ‌ని ఆయ‌న చెప్పేవారు. మ‌రి.. అలాంటి ప‌వ‌న్ కు ఏపీలో జ‌రుగుతున్న హోదా ఉద్య‌మం గురించి అవ‌గాహ‌న లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

హోదా సాధ‌న కోసం ఏపీ ప్ర‌తిప‌క్షం మొద‌ట్నించి మాట్లాడుతూనే ఉంది. హోదా సాధ‌న కోసం ఇప్ప‌టికే ప‌లు నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఏపీ ప్ర‌జ‌ల్లోని హోదా ఆశ‌ల్ని గుర్తించిన ఏపీ అధికార‌ప‌క్షం యూట‌ర్న్ తీసుకొని హోదాపై గ‌ళాన్ని విప్ప‌టం షురూ చేసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ హోదాపై గ‌ళం విప్పి ల‌బ్థి పొందాల‌ని ఆశిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు కొత్త‌గా ఉంది. రాబోయే ఎన్నిక‌ల్లో కాబోయే ముఖ్యమంత్రిగా ఫీల‌వుతున్న ప‌వ‌న్‌.. అందుకు త‌గ్గ అడుగులు వేయ‌టం మానేసి.. అర్థం లేని రీతిలో ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా ఏపీకి జ‌రిగిన అన్యాయంపై మాట్లాడిన వారిలో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రామ్మోహ‌న్ నాయుడులు చేసిన ప్ర‌సంగం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఏపీ స‌మ‌స్య‌ల‌పై వారి ప్ర‌సంగాలు జాతీయ స్థాయిలో విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి ఎదురైన క‌ష్టాలు తెలిసేలా చేశాయి.

మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి.. నేనే స్వ‌యంగా ఢిల్లీకి వ‌చ్చి జాతీయ పార్టీ నేత‌ల‌తో మాట్లాడతాన‌ని ప‌వ‌న్ చెప్ప‌టం తెలిసిందే. అయితే.. అవిశ్వాసం సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌నిపించిందే లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోయాక టీడీపీపై విమ‌ర్శ‌లు సంధిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎంపీ జ‌య‌దేవ్ ప్ర‌సంగం పేల‌వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు.. హోదా మీద యూట‌ర్న్ తీసుకున్నారంటూ టీడీపీ తీరును త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌త్యేక‌ ప్యాకేజీకి ఓకే అన్నారంటూ టీడీపీని త‌ప్పు ప‌ట్టారు. ప‌వ‌న్ ట్వీట్లు చూశాక అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే. ఆయ‌న‌కు ఏపీకి హోదా రావ‌టం ఇష్టం లేదు. ఎందుకిలా అంటే.. హోదా సాధ‌న కోసం ఎవ‌రైనా కొన్ని త‌ప్పొప్పులు చేసినా..వాటి బొక్క‌లు పీకి లెక్క‌లు వేసే క‌న్నా.. ఐదు కోట్ల ప్ర‌జ‌ల జీవితాల్ని ప్ర‌భావితం చేసే హోదా మీద ఫోకస్ మిస్ కాకూడ‌దు. తెలంగాణ‌ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్య‌మాన్నే చూసిన‌ప్పుడు.. ఉద్య‌మం చేసే పార్టీతో పాటు.. మిగిలిన పార్టీలేవీ కూడా తెలంగాణ సాధ‌న‌కు అడ్డు ప‌డే వ్యాఖ్య ఒక్క‌టంటే ఒక్క‌టి చేసేవారు కాదు.

తెలంగాణ సాధ‌న‌కు డ్యామేజ్ జ‌ర‌గ‌టానికి స‌సేమిరా అనేవారు. ఈ తీరుతో.. తెలంగాణ ఉద్య‌మం సంద‌ర్భంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా.. వాటిని వ‌దిలేసి తెలంగాణ సాధ‌న గ‌ళాన్ని మాత్ర‌మే వినిపించేవారు. రాజ‌కీయంగా ఉండే శ‌త్రుత్వాన్ని ఉద్య‌మంలోకి జొప్పించేవారు కాదు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే వారు. కానీ.. అదెప్పుడూ తెలంగాణ సాధ‌న స్పూర్తిని దెబ్బ తీసేలా ఉండేది కాదు. తెలంగాణ ఉద్య‌మాన్ని అత్యంత ద‌గ్గ‌ర‌గా చూశాన‌ని గొప్ప‌లు చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటున్న హోదా సాధ‌న‌పై ఏ పార్టీ మాట్లాడినా.. దానికి అండ‌గా నిల‌వాలే త‌ప్పించి.. వారి ప్ర‌సంగం పేల‌వంగా ఉంది.. వీరి ప్ర‌సంగం నిరాశ‌ను క‌ల్పించిందన్న విమ‌ర్శ‌ల‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంగ‌తే చూస్తే.. హోదా కోసం త‌మ ఎంపీలు రాజీనామా చేసిన నేప‌థ్యంలో త‌మ వాద‌న‌ను పార్ల‌మెంటులో వినిపించే అవ‌కాశం లేకున్నా.. త‌ర్వాతి రోజున ప్రెస్ మీట్ పెట్టి మోడీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. హోదా ఎట్టి ప‌రిస్థితుల్లో ఇవ్వాల‌నే మాట‌నే చెప్పారు. టీడీపీ ఎంపీలు ప్ర‌స్తావించిన వ్యాఖ్య‌ల్లో చాలా వ‌ర‌కూ తాము గ‌తంలో తెర మీద‌కు తెచ్చిన‌వ‌నే విష‌యాన్ని మాత్ర‌మే చెప్పారు త‌ప్పించి.. హోదా సాధ‌న‌ను నిరుత్సాహ ప‌రిచేలా.. మోడీ స‌ర్కారుకు ద‌న్నుగా నిలిచేలా ఆయ‌న మాట‌లు లేవ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

నిత్యం పుస్త‌కాలు చ‌దువుతూ.. చ‌దివి.. చ‌దివి. . క‌ళ్ల‌జోడు వ‌చ్చింద‌ని చెప్పే ప‌వ‌న్ కు.. పుస్త‌కాలు ఇచ్చిన తెలివి ఇదేనా? అన్న సందేహం రాక మాన‌దు. నిత్యం ఏదో ఒక త‌ప్పు వెతికే క‌న్నా.. హోదా సాధ‌న‌కు ఏమేం చేయాల‌న్న స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చే బాగుంటుంది. అవ‌స‌ర‌మైన ప‌త్తా లేకుండా పోయే ఆయ‌న‌.. అంతా అయ్యాక జడ్జిమెంట్లు ఇవ్వ‌టం స‌రికాద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.