నన్ను చంపడానికి వచ్చారు... నేను బలవంతుడ్ని

Wed May 23 2018 22:51:59 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని చెప్పిందెవరు? ఒకసారి గత మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలన్నీ వారికి చూపించండి. ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డాక కార్పొరేటర్ నుంచి ఎంపీ వరకు ఎవరు ఎన్ని వేషాలు వేస్తారో అవన్నీ పవన్ ఈ మూడు రోజుల్లోనే నాటకీయంగా పండించారు. ఒక్కో విషయమూ పవన్‌లోని ఒక్కో యాంగిల్‌ను జనానికి పరిచయం చేసింది. గంటకు గంటకు కొత్త ఆరోపణలు చేస్తూ ఆయన రాజకీయాల్లో కేజ్రీవాల్‌ను కూడా మించి పోయారు. అయితే ఈరోజు జగన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో పవన్ కళ్యాణ్ మాటలన్నింటికీ కౌంటర్ పడినట్లయ్యింది.నిన్నటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి మాట వెనుక టీడీపీ మీద జనాలకు ఉన్న వ్యతిరేకత కోపం తన మీద ప్రభావం చూపకుండా ఉండేందుకు ఆయన పడుతున్న తాపత్రయంగా అనిపించాయి. అందుకే విమర్శించాడు అల్టిమేటాలిచ్చారు చివరకు హత్యారోపణలు కూడా చేశారు. ఇవన్నీ సరిపోతాయో లేదో అనుకున్నాడో ఏమో... చివరకు పశ్చాత్తాపం కూడా చెందాడు. *పవన్ కళ్యాణ్ అనే మేధావి రాష్ట్రాన్ని ముంచారు ఇపుడు తెలిసొచ్చిందా* అని వైస్ జగన్ చేసిన వ్యాఖ్యలతో పవన్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది. అందుకే ఈరోజు చంద్రబాబు మీద చెలరేగిపోయారు.

పవన్ కళ్యాణ్ బాబు పై చేసిన వీరంగం ఆయన మాటల్లోనే... *విభజన నుంచి ప్రత్యేక హోదా వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అన్నింటిని విస్మరించారు. తాను ఎక్కడ ఓడిస్తానో అని నన్ను లేకుండా చేయాలని చూస్తున్నారు. తనపై కొందరు కిరాయి రౌడీలు రాత్రిపూట దాడికి ప్రయత్నించారు. పలాసలో రాత్రి సమయంలో తాను విడిది చేసిన కళ్యాణ మండపంలో కరెంట్ తీసి తనపై దాడికి ప్రయత్నించారు. కానీ తాను అన్నింటికి తెగించి వచ్చాను. కిరాయి గూండాలు వస్తూ చూస్తూ ఊరుకుంటానా? వారి  బట్టలు ఊడదీసి కొడతా.

ప్రత్యేక హోదా విషయంలో జనసేన మొదటి నుంచి ఒకే మాటపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోజే తమతో గొంతు కలిపి ఉంటే హోదా వచ్చి ఉండేది. ప్రత్యేక హోదాకు అధికారికంగా తూట్లు పొడిచింది రాష్ట్ర ప్రభుత్వమే. కాంగ్రెస్ కు టీడీపీ బీజేపీ ఏం తీసిపోవడం లేదు. వారు చేసిన తప్పులు మించి చేస్తున్నారు వీళ్లు.  ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలాగే ఇక్కడ కూడా టీడీపీ అదృశ్యం అవుతుంది. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకోవద్దు. పార్టీ కంటే ప్రజలు ముఖ్యం. ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాట మార్చి ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అంటున్నారు. ఎక్కడుంది ధర్మం?  ఇవన్నీ తెరపైకి వచ్చిన కొత్త డ్రామాలు. చంద్రబాబు సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు* అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.

అంతా బానే ఉంది గాని పవన్ కళ్యాణ్ కు గుర్తుందో లేదో ఆయన ప్యాకేజీ బాగుందని చెప్పిన విషయాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అసలు ప్రత్యేక హోదాపై చంద్రబాబు కలిసి రాకపోతే ఆయనతో ఎందుకు కలిసి ఉన్నాడో మాత్రం పవన్ వివరించలేకపోయారు. మొత్తానికి పవన్ ప్రసంగం నుంచే ప్రత్యర్థులకు కావల్సినన్ని విమర్శానాస్త్రాలు దొరుకుతున్నాయి.