Begin typing your search above and press return to search.

కూలీ కొడుకు.. కండ‌క్ట‌ర్ కొడుకు.. ప‌వ‌న్ అభ్య‌ర్థులు!

By:  Tupaki Desk   |   21 March 2019 5:46 AM GMT
కూలీ కొడుకు.. కండ‌క్ట‌ర్ కొడుకు.. ప‌వ‌న్ అభ్య‌ర్థులు!
X
ఇవాల్టి రోజున ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే..? వ‌ంద‌ల కోట్ల ఆస్తులు కానీ.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం కానీ.. గూండాగిరి.. రౌడీయిజం.. లేదంటే పెద్దోళ్ల‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటూ.. వారి అవ‌స‌రాల్ని తీరుస్తూ ఉండాలి. అంతే త‌ప్పు స‌మాజానికి ఏదో చేయాల‌న్న ఆలోచ‌న రాజ‌కీయ నేతల్లో పెద్దగా క‌నిపించ‌దు.

ఎక్క‌డిదాకానో ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. రాజ‌కీయ చాణుక్యంతో త‌మ‌కు మించి తోపులు మ‌రెవ‌రూ ఉండ‌రంటూ త‌ర‌చూ చెప్పుకునే ఇద్ద‌రు చంద్రుళ్లు త‌మ క‌ల‌లో కూడా ఊహించ‌ని ప‌నిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేత‌ల్లో చేసి చూపించారు. ఆద‌ర్శాలు వ‌ల్లించ‌టం ఒక ఎత్తు.. వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టి చూపించ‌టం మ‌రో ఎత్తు. ప‌వ‌న్ రెండో తీరు అన్న విష‌యాన్ని తాజాగా ఆయ‌న ఎంపిక చేసిన అభ్య‌ర్థుల్లో కొంద‌రిని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

వాస్త‌వానికి ప‌వ‌న్ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల బ్యాక్ గ్రౌండ్ ను చూసిన‌ప్పుడు విస్మ‌య‌క‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌ధాన మీడియా ఏదీ కూడా ఈ అంశాల మీద దృష్టి సారించ‌క‌పోవ‌టం తెలుగు ప్ర‌జ‌లు చేసుకున్న పాపంగా చెప్ప‌క త‌ప్ప‌దు. పేరున్న మీడియా సంస్థ‌లేవీ ప‌వ‌న్ షురూ చేసిన కొత్త ఒర‌వ‌డిని ప‌ట్టించుకున్న‌ది లేద‌ని చెప్పాలి.

తాజాగా జ‌న‌సేన అభ్య‌ర్థులుగా ఎంపిక చేసిన వారిలో కొంద‌రు అత్యంత సామాన్యులు ఉన్నారు. వారి త‌ల్లిదండ్రులు దిన‌స‌రి కూలీలుగా.. బ‌స్ కండెక్ట‌ర్ కొడుకులుగా ఉన్న వారు ఉన్నారు. మ‌నలో ఒక‌రు.. మ‌న చుట్టూనే ఉంటూ.. స‌మాజాన్ని మార్చాల‌ని.. త‌మ చుట్టూ ఉన్న ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల్ని పెంచాల‌ని త‌పించే వారిని గుర్తించి ఎంపిక చేసిన తీరును మెచ్చుకోవాల్సిందే.రాజ‌కీయం అన్నంత‌నే కోట్లు ఖ‌ర్చు పెట్టే స‌త్తా ఉన్నోళ్లే అన్న‌ట్లుగా త‌యారు చేసిన ఇద్ద‌రు చంద్రుళ్ల తీరుకు భిన్నంగా ప‌వ‌న్ తీరు ఉంద‌ని చెప్పాలి.

ప‌వ‌న్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న గౌరీ శంక‌ర్ విష‌యానికి వ‌ద్దాం. విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన అత‌డు సామాన్య కుటుంబ నేప‌థ్యం ఉన్నోడు. అత‌డి తండ్రి గుంప‌స్వామి వ్య‌వ‌సాయ కూలీ. ఇక‌.. అత‌డి త‌ల్లి అప్పాయ‌మ్మ కూర‌గాయ‌లు అమ్ముతుంటారు. జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్న అత‌న్ని ప‌వ‌న్ త‌న ఫ్యూచ‌ర్ టీం కోసం అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు.

ఇక‌.. గేదెల చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. అత‌నికి శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు. అత‌నో రిటైర్డ్ బ‌స్ కండక్ట‌ర్ కొడుకు కావ‌టం గ‌మ‌నార్హం. ఉద్దాణం ఎపిసోడ్ లో అత‌ను చురుగ్గా ప‌ని చేయ‌టంతో అత‌నికి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప‌వ‌న్ ఎంపిక చేశారు. అయితే.. నికార్సు అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపితేనే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధ్యం కాదు. అయిన‌ప్ప‌టికి త‌న అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఇద్ద‌రు ముగ్గురి ఎంపిక‌లో అయినా ప‌వ‌న్ అనుస‌రించిన తీరు అభినంద‌నీయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గెలుపోట‌ములు త‌ర్వాత‌.. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపిక‌లో ప‌వ‌న్ కాసిన్ని మార్కులు కొట్టేశార‌ని చెప్పాలి.