Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్‌ వి పగటి కలలేనా?

By:  Tupaki Desk   |   21 May 2018 3:39 PM GMT
పవన్ కల్యాణ్‌ వి పగటి కలలేనా?
X
2019లో ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తాం.. నేను సీఎం అవుతాను.. ఇదీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ నోట వినిపిస్తున్న మాట. ఆయన తాజా పోరాట యాత్రను చూస్తున్నవారికి పవన్ ఇంతకుముందు కంటే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఆయనలో మునుపటి అయోమయం కనిపించడం లేదు.. ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. కానీ... ఎప్పటిలాగా పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ కుమ్ములాటల మధ్య ఓట్లు చీలిన పుణ్యమా అని తనకున్న 40 సీట్లలో 37ని నిలబెట్టుకున్న జేడీఎస్‌ను, ఎలాగైనా బీజేపీకి అధికారం దక్కకుండా అడ్డుకోవాలన్న కసి వల్ల కాంగ్రెస్ తన భుజాలకెత్తుకోవడంతో జేడీఎస్ నేత కుమారస్వామి అక్కడ సీఎం అవుతున్నారు. చిన్నపార్టీలు.. తక్కువ సీట్లు వచ్చినా సరే సీఎం కావొచ్చనడానికి ఇది ఉదాహరణే కావొచ్చు.. కానీ, కొత్త పార్టీలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటే సరిపోదు. అంతేకాదు.. జాతీయ పార్టీలకు స్పేస్ లేని ఏపీలో అలాంటి ఫార్ములాలు వర్కవట్ కావడమూ కష్టమే. కానీ.. పవన్ కాన్ఫిడెన్సు చూస్తుంటే ఆయనలో ఇదే ఆశ ఉన్నట్లుగా అనిపిస్తోంది. వైసీపీకి ఎలాగైనా అధికారం దక్కకుండా చేసే ప్రయత్నంలో టీడీపీ తనపై ఆధారపడుతుందన్నది ఆయన ఆశ కావొచ్చు.

కానీ.. వాస్తవాలు అందుకు భిన్నంగానే ఉణ్నాయి. పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కనిపించిన వేవ్ ఇప్పుడు పవన్ కు ఉందా అన్నది తొలి ప్రశ్న. చిరంజీవికి అంత హవా ఉన్నప్పుడు ఆయన సాధించిన సీట్లు ఎన్నన్నది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్నకు సమాధానం అభిమానులు, అభిమానులు కానివారి నుంచి వేర్వేరుగా రావొచ్చు. కానీ.. రెండో ప్రశ్నకు సమాధానం మాత్రం ఒక వాస్తవం. కేవలం 18 సీట్లన్నది దానికి సమాధానం. అది కూడా ఉమ్మడి రాష్ర్టంలో. ఇప్పుడు పవన్ రాజకీయ క్షేత్రం ఏపీ మాత్రమే. ఎన్ని స్థానాల్లో పోటీకి ఆయనకు అభ్యర్థులు దొరుకుతారు.. అందులో ఎంతమంది టీడీపీ, వైసీపీలను తట్టుకోగలరు వంటివన్నీ మిగతా ప్రశ్నలు. వీటికి తోడు కుమారస్వామికి ఉన్నంత రాజకీయ అనభవం పవన్‌కు ఉందా? జేడీఎస్‌కు ఉన్నంత పార్టీ నిర్మాణం జనసేనకు ఉందా? దేవెగౌడలాంటి సంకీర్ణాల కింగ్ అనుభవసారం పవన్‌కు ఉందా అన్నవి పవన్ సమాధానం చెప్పలేని ప్రశ్నలు. ఇన్ని చిక్కు ప్రశ్నలుండగా పవన్ ఎవరూ అడక్కుండానే ముందే చెబుతున్న సమాధానం ‘నేనే సీఎం’ అన్నది సరైన జవాబవుతుందన్నది నమ్మడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే అప్పటికి పవన్ జనసేన పార్టీకి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. చిరుపార్టీకి విపరీతమైన ఆదరణ. ఆయన తిరుపతిలో పార్టీ ప్రకటించడానికి ముందు, తరువాత కూడా అదే జోరు. ఆయన ప్రభంజనం సృష్టించడం ఖాయమనుకున్నారు. కానీ.. చిరు చివరికి 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాను రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్‌కు అందులో పదో వంతు కూడా కనిపించడం లేదు. అయినా, ఆయన మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ.. రాజకీయ నేతలు, విశ్లేషకులు మాత్రం పవన్‌కు 10 సీట్లు వస్తే గొప్పే అంటున్నారు. అభిమానులు, సామాజికవర్గ సహకారం ఒక్కటే చాలదని, అన్ని వర్గాల ఆదరణ ఉంటేనే సీఎం కుర్చీ అందుకోగలరని.. అంతేకానీ, నేనే సీఎం అన్నంతమాత్రాన సీఎం కాలేరని అంటున్నారు. కలలు మాని మొదట పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.