ఇటు పవన్.. అటు నాగబాబు.. మోత మోగించేస్తున్నారు

Wed Jun 12 2019 14:50:34 GMT+0530 (IST)

2009 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల్లో 18 సీట్లకే పరిమితం అయ్యారు. దాన్ని ఆయన పెద్ద పరాభవంగా భావించారు. తర్వాత పార్టీని మోటివేట్ చేసే ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఆయనే స్వయంగా ఒక రకమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. పార్టీ శ్రేణుల్ని కూడా నైరాశ్యంలోకి నెట్టేశారు. రెండేళ్లు తిరక్కుండానే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తన రాజకీయ జీవితాన్ని స్వయంగా సమాధి కట్టేసుకున్నారు. కానీ తాజా ఎన్నికల్లో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్.. అన్నను మించి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. జనసేన తరఫున ఒకే ఒక అభ్యర్థి గెలిచాడు. పవన్ తో పాటు ఆయన అన్న నాగబాబు కూడా పరాభవం చవిచూశాడు. అయినప్పటికీ అన్నదమ్ములిద్దరూ వెనకడుగు వేయట్లేదు. భవిష్యత్ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికల ఫలితాల అనంతరం వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ నాగబాబు.. పార్టీ నాయకులు కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 'ఓటమి గెలుపుకు తొలి మెట్టు'.. 'దెబ్బలు తిందాం.. బలంగా పైకి లేద్దాం భవిష్యత్ మనదే'.. 'ఇది ఓటమి కాదు.. విరామం మాత్రమే' అంటూ సినిమాల తరహాలో అన్నదమ్ములు మోటివేషన్ స్లోగన్స్ ఇస్తున్నారు. తాజాగా నాగబాబు తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. '' మంచి మాట: నొప్పి రెండు రకాలు - మొదటిది మిమల్ని బాధిస్తుంది. రెండోది మిమల్ని మారుస్తుంది.'' అంటూ ఒక మాట కోట్ చేశాడు. ఇటీవల ఎన్నికల్లో జనసేన ఓటమిని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది. దీనిపై మెగా అభిమానులు జనసేన మద్దతుదారులు సానుకూలంగానే స్పందించారు. ఎన్నికల్లో ఓటమిని రెండో రకం నొప్పిగానే భావిస్తున్నామని.. కచ్చితంగా మార్పు చూపిస్తామని.. వచ్చే ఎన్నికల నాటికి జనసేనను బలంగా తీర్చిదిద్దుతామని.. మంచి ఫలితాలు రాబడతామని అంటున్నారు. ఐతే కార్యకర్తల్ని మోటివేట్ చేసేముందు మెగా బ్రదర్స్ కూడా మారి.. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం మీద దృష్టిపెడితే తప్ప వచ్చే ఎన్నికల్లోనూ జనసేన మెరుగైన ఫలితాలు రాబట్టలేదన్నది స్పష్టం.