Begin typing your search above and press return to search.

లిమ్కా బుక్‌ లోకి ప‌ట్టిసీమ‌..

By:  Tupaki Desk   |   25 March 2017 6:39 AM GMT
లిమ్కా బుక్‌ లోకి ప‌ట్టిసీమ‌..
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల ప్రాజెక్టు అయిన పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఎల్ ఐఎస్)కు ఊహించ‌ని గుర్తింపు ద‌క్కింది. పట్టిసీమ ప్రాజెక్టుకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. అతితక్కువ కాలంలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో నమోదైంది. కేవలం 173 రోజుల్లోనే పూర్తయిన ప్రాజెక్టుగా పట్టిసీమకు గుర్తింపు వచ్చింది. ఈ ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఇప్ప‌టికే అధికార పార్టీ ప్ర‌చారం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ప‌ట్టిసీమకు బీజం ప‌డ‌టం వెనుక కార‌ణాలు ఆస‌క్తిక‌రం. గోదావరికి ప్రతి ఏటా వరదలు మామూలే. ఈ నీటిని నిల్వ చేయడానికి ఎక్కువ రిజర్వాయర్లు లేకపోవడంతో ఎంతో విలువైన గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఈ నీటిలో కొంతయినా నిల్వ చేయాలన్నది ఒరిజనల్ ప్లాను. అయితే, పోలవరం ప్రాజెక్టుకు వేలకోట్ల రూపాయలు అవసరం - అనుమ‌తుల కార‌ణంగా ప్రాజెక్టు జాప్యం అవుతోంది. అందుకని, పశ్చిమగోదావరిజిల్లా పట్టిసీమ దగ్గర ప్రాథ‌మికంగా ఒక ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టు కట్టి - కొంత నీటినైనా - కృష్ణానదికి మళ్ళిస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రోజుకు 8500 క్యూసెక్కుల చొప్పున 80 రోజుల పాటు నిర్విరామంగా నీటిని తోడతారు. దాదాపు 80 శతకోటి ఘనపుటడుగుల నీటిని మళ్ళించాలన్నది లక్ష్యం. గోదావరిలో వరద ఉండడంతో ఈ ల‌క్ష్యాన్ని ఎంచుకున్నారు.. తద్వారా కృష్ణ డెల్టాకు సమృద్ధిగా నీరు అందుతుంది.

కాగా, తన హయాంలోనే మొదలై తన హయాంలోనే పూర్తవ్వాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్ష. గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడికాల్వలోకి పోసే ఈ స్కీమ్ కు సంబంధించిన తొలి జీవో 2015 జనవరి 1న జీవో నెంబర్ 1 గా విడుదల చేశారు. గోదావరి వరద నీటిని మాత్రమే ఉపయోగించుకుని నదుల అనుసంధానాన్ని దీని ద్వారా నెరవేర్చాలన్నది కూడా సీఎం లక్ష్యం. అమరావతికి కూడా నీళ్ళివ్వొచ్చని స్కెచ్ వేశారు. ఫిబ్రవరి 23, 2015న హైదరాబాద్ కు చెందిన మెగా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) కు కాంట్రాక్ట్ ఇచ్చారు. మార్చి 29న పట్టిసీమ గ్రామంలో పునాదిరాయి వేశారు. అఖండ గోదావరి నీటిని పట్టిసీమ దగ్గర 8500 క్యూసెక్కుల పంపుల ద్వారా ఎత్తిపోయాలని సంకల్పించడంతో అక్కడ పంపుల ఏర్పాటుకు పనులు మొదలెట్టారు. అక్కడ కనిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 14 మీటర్లుండాలి. ఒక్కోటి 354 క్యూసెక్కులను పంప్ చేయగల 24 టర్బైన్ పంపులను నెలకొల్పాలి. ప్రధాన పైపు పొడవు 3.925 కిలోమీటర్లు. మోటార్లు పనిచేయడానికి 113 మెగావాట్ల విద్యుత్ అవసరం.ఇదంతా చేయడం బృహత్ప్పయత్నమే అయ్యింది. 24 పంపులకు ఒక్కోటి 5300 హార్స్ పవర్ ఉన్న మోటార్లు బిగించారు. తొలుత 1300 కోట్లు ఖర్చవుతుందనుకున్నా ఆ తరువాత ఈ మొత్తాన్ని 1800 కోట్ల రూపాయలకు పెంచారు. ఇలా అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించి లిమ్కా బుక్ లోకి ఎక్కారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/