Begin typing your search above and press return to search.

మహిళా నేతకు కన్నుకొట్టాడు..సీఎంకు ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   21 Aug 2019 10:25 AM GMT
మహిళా నేతకు కన్నుకొట్టాడు..సీఎంకు ఫిర్యాదు!
X
ఇంటా బయటా - ఆఫీసుల్లో - కాలేజీల్లోనేనా ర్యాగింగ్ లు.. రాజకీయాల్లో కూడా ఉన్నాయని నిరూపించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. మేయర్ కొడుకు కన్ను కొట్టాడని కౌన్సిలర్.. అబ్బే పాత కక్షలతోనే ఇలా కౌన్సిలర్ ఆరోపిస్తోందని మేయర్.. ఈ లొల్లి సీఎం వరకు వెళ్లే సరికి ఇప్పుడు ‘కన్నుకొట్టిన వ్యవహారం’ రాజకీయంగా సంచలనంగా మారింది.

బీహార్ రాజధాని పాట్నా మున్సిపాలిటీలో ఈ ‘కన్నుకొట్టుడు’ వివాదం రాజుకుంది. మేయర్ సీత సాహు కుమారుడు శిశిర్ ఇప్పటికే బీహార్ మున్సిపాలిటీలో తల్లిచాటు బిడ్డగా తనే మేయర్ లాగా అన్ని చక్కదిద్దుతూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మేయర్ సీత సాహును తన వార్డులోని సమస్యలపై పింకీ కుమారి అనే మహిళా కౌన్సిలర్ నిలదీసింది. అక్కడే ఉన్న మేయర్ సీత కొడుకు శిశిర్ అమెను అడ్డుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. మాట్లాడుతుండగా ఆమెకు కన్నుకొట్టి ఇబ్బందిపెట్టాడు. దీనిపై కౌన్సిలర్ పింకీ మేయర్ సీత దృష్టికి కొడుకు వ్యవహారంపై తీసుకెళ్లింది.

అయితే కొడుకు కన్నుకొట్టాడని మహిళా కౌన్సిలర్ చెప్పినా మేయర్ సీత మాత్రం కొడుకును వెనుకేసుకురావడం వివాదాస్పదమైంది. పింకీ కావాలనే ఆరోపణలు చేస్తోందని సర్ధిచెప్పింది. పింకీనే తిట్టిపోసింది..

మేయర్ కొడుకు కన్నుగీటినా పట్టించుకోని మేయర్ పై మహిళా కౌన్సిలర్ పోరుబాట పట్టింది. ఈ విషయాన్ని బీమార్ సీఎం నితీష్ దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేసింది. అంతేకాదు.. పోలీస్ స్టేషన్ లో కూడా కన్నుగీటిన మేయర్ కుమారుడిపై ఫిర్యాదు చేసింది.

అయితే ఈ వార్తలు మీడియాలో హైలెట్ కావడంతో మేయర్ కొడుకు శిశిర్ వివరణ ఇచ్చాడు. ఇటీవల మున్సిపల్ శాశ్వత కమిటీల్లో మహిళా కౌన్సిలర్ పింకీని తొలగించామని.. అది మనసులో పెట్టుకొనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అతడు స్పష్టం చేశాడు. ఆమెపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు మీడియాకు తెలిపారు.