Begin typing your search above and press return to search.

‘సర్జికల్’లో బయటకు రాని కోణమిది..

By:  Tupaki Desk   |   1 Oct 2016 6:13 AM GMT
‘సర్జికల్’లో బయటకు రాని కోణమిది..
X
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిర్వహించిన లక్షిత దాడుల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. ఈ వ్యవహారంపై దేశ జనులంతా ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్న పరిస్థితి. నిజానికి భారత్ తో పాటు.. పలు దేశాల్లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. శాంతి కాముక దేశంగా.. సహనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే భారత్ దూకుడుగా దూసుకెళ్లటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఆపరేషన్ ఎలా జరిగిందన్న సమాచారం బయటకు వచ్చినా.. సర్జికల్ దాడులకు సంబంధించిన మరో ఆసక్తికర కోణం బయటకు రాలేదు.

కేవలం సర్జికల్ స్ట్రైక్స్‌ మాత్రమే కాదు.. లెక్క తేడా వస్తే పూర్తిస్థాయిలో దుమ్ము రేపేందుకు సైతం భారత్ ప్రిపేర్ అయ్యిందా? అంటే అవుననే చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సర్జికల్ దాడులకు సంబంధించిన ఆసక్తికర కోణం ఒకటి బయటకు వచ్చింది. సర్జికల్ దాడుల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న కమాండోలు పూంఛ్ జిల్లాలోని నౌగామ్ సెక్టార్ ద్వారా పాక్ లోకి ప్రవేశించారు.

గుట్టల్లో ట్రెక్కింగ్ చేసిన వారు.. నియంత్రణ రేఖకు రెండు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ బృందం ఉగ్రవాద స్థావరాల వద్దకు అర్థరాత్రి దాటిన తర్వాత.. సుమారు 1.45 గంటలకు చేరుకున్నారు. అప్పటివరకూ అంతా బాగానే జరిగినా.. అనుకోని ప్రమాదం ముంచుకొస్తే ఏం చేయాలన్న దానికి ప్లాన్ బి కూడా రెడీ చేసుకుంది భారత సైన్యం. టార్గెట్ ల వద్దకు వెళ్లిన సర్జికల్ స్పెషలిస్ట్ లకు అనుకోని ప్రమాదం జరిగితే.. వెనువెంటనే వారికి సాయంగా నిలిచేందుకు.. జమ్ముకశ్మీర్.. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ల నుంచి హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు.

సర్జికల్ స్సెషలిస్ట్ లు చేస్తున్న ఆపరేషన్ ను లైవ్ లో గమనిస్తున్న ఉన్నతాధికారులు.. అనుకున్నది అనుకున్నట్లు పక్కాగా జరిగేందుకు సాయం అందించారు. లక్ష్యాన్ని చేరుకోవటం.. ఆపరేషన్ ను పూర్తి చేసేలా కమాండోలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వటమే కాదు.. బంకర్లలో ఉన్న ఉగ్రవాదులపై మెరుపుదాడి చేసేలా చూశారు. ఒక్కో బంకర్లో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన సైన్యం.. అనంతరం బంకర్లను సైతం పూర్తిగా ధ్వంసం చేసి.. తిరిగి తమ దారిన తాము వచ్చేశారు. ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగి ఉంటే.. పూర్తిస్థాయి దాడికి సైతం సైన్యం సిద్ధమైందన్న విషయం తాజా ఇష్యూను చూస్తే అర్థమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/