Begin typing your search above and press return to search.

వాయింపు పక్కా అని తేల్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:39 AM GMT
వాయింపు పక్కా అని తేల్చేస్తున్నారు
X
దేశ రూపురేఖలు మార్చేస్తామంటూ ఊరిస్తూ అధికారంలోకి వచ్చిన మోడీ పుణ్యమా అని మార్పు తర్వాత సంగతి.. జేబులకు చిల్లు మాత్రం బాగానే పడుతోంది. అవకాశం ఉన్న ప్రతి రంగంలోనూ పన్నుల వాత.. సబ్సిడీల కోతను విధిస్తూ మోడీ సర్కారు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది. వీటన్నింటికి మించి ఎప్పుడో ఒకసారి తప్పించి పెద్దగా వడ్డింపులు ఉండని రైల్వేలకు సంబంధించి.. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఏదో రూపంలో వడ్డించేస్తున్న రైల్వేలు.. ఈసారి రైల్వే బడ్జెట్ లో భారీగా ఛార్జీలు పెంచేస్తారని చెబుతున్నారు.

తక్కువలో తక్కువ 5 శాతం నుంచి 10 శాతం వరకు ప్రయాణ ఛార్జీల భారాన్ని దేశ ప్రజల మీద మోపేందుకు మోడీ సర్కారు రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది. లాలూ హయాంలో లాభాల్లో నడిచినట్లు చెప్పే రైల్వేలు ఇప్పుడు తీవ్ర నష్టాల్లో ఉన్నట్లుగా.. నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ లో పెంపును ప్రతిపాదిస్తే.. వెనువెంటనే భారీ ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రైల్వేల్లో ఏసీ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కంటే విమాన ఛార్జీలు తక్కువగా ఉంటున్న పరిస్థితి. తాజా పెంపుతో.. విమాన ఛార్జీలను తలదన్నేలా ఏసీ మొదటి తరగతి ధరలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరకు రవాణా ఛార్జీల పెంపు లేనట్లేనని.. ప్రయాణికుల మీద ఛార్జీల వడ్డన మాత్రం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. దేశ ప్రజల జేబుల మీద రానున్న కొద్దిరోజుల్లో మరో చిల్లు పడటం ఖాయమన్న మాట.