Begin typing your search above and press return to search.

ఈ శీతాకాల సమావేశాల్లో ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:11 AM GMT
ఈ శీతాకాల సమావేశాల్లో ఏం జరగనుంది?
X
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరికాసేపట్లో షురూ కానున్నాయి. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 23 వరకు సాగే ఈ సమావేశాల్లో మొత్తం పనిదినాలు 20 మాత్రమే. అత్యంత కీలకమైన బిల్లులు ఈ సమావేశంలో సభ ముందుకు రానున్నాయి. వర్షాకాల సమావేశాల తర్వాత నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు చాలానే ప్రాధాన్యతలు ఉన్నాయి. గత సమావేశాలతో పోలిస్తే ఈ సమావేశం నాటికి అధికారపక్షం కాస్తంత బలహీనపడితే.. విపక్షాలు మరింత బలాన్ని పుంజుకున్నాయి. గత సమావేశాల నాటికి భవిష్యత్తు పట్ల అధికారపక్షం ధీమాగా ఉంటే.. విపక్షాలు నిరాశలో ఉండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మోడీ సర్కారుకు.. మత అసహనం.. బీఫ్ వివాదం లాంటివెన్నో ఉన్నాయి.

దేశాన్ని కుదిపేస్తున్న మత అసహనం మీద చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారం అధికార.. విపక్షాల మధ్య మాటల మంటలు రేపే అవకాశం ఎక్కువగా ఉంది. అదే సమయంలో సభ ముందుకు 7 కొత్త బిల్లులతో సహా మొత్తం 38 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. మొత్తం బిల్లులలో వస్తుసేవల బిల్లును ఏదో విధంగా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలన్న ఆలోచనలో అధికారపక్షం ఉంది. దీనికి తగ్గట్లే విపక్షాలతో ఇప్పటికే చర్చలు జరిపి.. ఓకే అనేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. మరి.. సమావేశాల ముందు నిర్వహించిన చర్చలు ఎంతవరకు వర్క్ వుట్ అయ్యాయన్న విషయం సమావేశాలు షురూ అయితే కానీ.. అర్థం కాని పరిస్థితి. విపక్షాల పట్ల ఆచితూచి అడుగులేసేలా అధికారపక్షం వ్యవహరించనుందన్న మాట వినిపిస్తోంది.

గత సమావేశాల్లో మాదిరి వ్యవహారశైలి ఈసారి కనిపించే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీలైనంతవరకు బిల్లుల ఆమోదం దిశగా అధికారపక్షం వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. పాలనలో మార్పులకు.. కొత్త విధానాల్ని అమల్లోకి తీసుకురావటంలో పలు బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మోడీ తన మార్క్ ను చూపించే వీలుంది. శీతాకాల సమావేశాలు మోడీ సర్కారుకు కత్తి మీద సాము లాంటిదేనని చెప్పకతప్పదు. గత సమావేశాల మాదిరి మోడీ వ్యవహరించే వీలు ఉండదని చెప్పొచ్చు. సీరియస్ గా సభ జరిగే సమయాల్లో సభలో పెద్దగా కనిపించని మోడీ.. ఈ శీతాకాల సమావేశాల్లో అలాంటి ధోరణి ప్రదర్శించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. సమావేశాలు ఎలా జరుగుతాయన్నది కాలమే చెప్పాలి.