బాదల్ ను చూసైనా బుద్ధి తెచ్చుకోండయ్యా..!!

Mon Mar 20 2017 13:26:00 GMT+0530 (IST)

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేంద్రంలో అయితే కొత్త ఎంపీలకు.... రాష్ర్టాల్లో అయితే ఎమ్మెల్యేలకు  కేటాయించిన ప్రభుత్వ బంగళాలు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోంది. ఓడిపోయిన - పదవీకాలం పూర్తయిన ఎంపీలు - మంత్రులు - ఎమ్మెల్యేలు తమ నివాసాలను ఖాళీ చేయడంలేదు. చట్టాలు - నియమ నిబంధనలు తయారు చేసేబాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారే స్వయంగా ఆ నియమ నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ సమస్య తలెత్తుతూనే ఉంది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా మన ప్రజా ప్రతినిధుల తీరు మాత్రం మారలేదు.  మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో ప్రభుత్వ బంగళా ఖాళీ చేయించడానికి అధికారులకు ఏడాది పట్టింది.  మాజీ మంత్రి కిల్లి కృపారాణి విషయంలో అయితే ఆమె ఎప్పటికీ ఖాళీ చేయకపోవడంతో చివరకు అధికారులు ఆ ఇంటికి తాళం వేయాల్సి పరిస్థితి వచ్చింది. అంతలా సతాయిస్తుంటారు మన బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులు.. కానీ... కొందరు మాత్రం ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారు. తమ పదవి పూర్తవగానే ప్రభుత్వ భవనాలు ఖాళీ చేస్తారు. తాజాగా పంజాబ్ లో అధికారం కోల్పోయిన ప్రకాశ్ సింగ్ బాదల్ అయితే కొత్త ప్రభుత్వం తనకు నివాసం కేటాయించినా కూడా తీసుకోకపోవడం విశేషం.
    
పంజాబ్ ను వరుసగా పదేళ్లపాటు పాలించిన ప్రకాశ్ సింగ్ బాదల్ మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ గెలవడంతో అమరీందర్ సింగ్ సీఎం అయ్యారు.  ఐదు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేసిన బాదల్ ప్రస్తుతం నివసించడానికి అమరీందర్ ప్రభుత్వం ఒక భవనాన్ని ఇవ్వజూపింది. అయితే.. బాదల్ అందుకు అంగీకరించలేదు. తాను సొంతంగా వేరే ఇంటిని వెతుక్కుంటానని.. ప్రభుత్వంపై ఆ భారం వద్దని సున్నితంగా తిరస్కరించారు.
    
దీనిపై బాదల్ స్పందిస్తూ ముఖ్యమంత్రి తనపట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శించారని ఆయన ఆదరణకు తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వంలో లేను కాబట్టి ప్రభుత్వ భవనంలో ఉండడం భావ్యం కాదని... తాను కొత్త ఇంటిని వెతుక్కుంటానని ఈ సీనియర్ లీడర్ చెప్పారు. ఇది చూసైనా మన నేతలకు బుద్దొస్తుందో లేదో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/