మంత్రి పదవి కోసం టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పూజలు??

Mon Jul 17 2017 18:21:27 GMT+0530 (IST)

మంత్రి పదవి దక్కాలంటే ఏం చేయాలి? ప‌్రస్తుత రాజకీయాల్లో అయితే సీనియారిటీ - ప్రజాబలం కంటే అధిష్టానం - పార్టీ ముఖ్యుల మద్దతు కావాలి. కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు దీనికి మధ్యే మార్గం కనిపెట్టారు. అదే కోయదొరలతో పూజలు చేయడం. అయితే అలా పూజలు చేయడం ద్వారా ఆయనకు మంత్రి పదవి దక్కడం సంగతి పక్కనపెడితే రూ.57 లక్షలు చేతి చమురు వదిలినట్లు ప్రచారం జరుగుతోంది.

మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం .....పూజలు చేస్తే మంత్రి పదవి దక్కుతుందని చెప్పి రూ. 57 లక్షలు తీసుకొని ఓ ఎమ్మెల్యే  కుటుంబాన్ని కోయదొరలు బురిడీ కొట్టించారని వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరిగింది. మోసం విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు  గోప్యంగా విచారణ చేపట్టారని సమాచారం. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఆ నేత  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు మనసా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధర్మారెడ్డి పేరు బయటకు వచ్చిందని సమాచారం. ఈ ఘటన మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే వారు అధికారికంగా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యే చల్ల ధర్మరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి కోసం తాను పూజలు చేయలేదని స్పష్టం చేశారు. తన కూతురే ఆరోగ్యం కోసం పూజలు చేసిందని తెలిపారు. తనకు ఆ  విషయం తెలియగానే కేస్ పెట్టించానని అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యులే  కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పూజలు చేసారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని కోయదొరలు పోలీసుల వద్ద ఒప్పుకున్నారని తెలిపారు. తన వద్ద కొందరు వీఐపీలు పూజాలు చేసిన ఫోటోలు కూడా ఉన్నాయని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.