పవన్ గుండుపై పరిటాల సునీత చెప్పిన నిజం

Mon Dec 11 2017 14:49:27 GMT+0530 (IST)

జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఆసక్తికరమైన విషయం పంచుకున్న సంగతి తెలిసిందే. పార్టీ లక్ష్యాలను వివరిస్తూనే..ఈ సందర్భంగా ఎప్పటినుంచో తనపై జరుగుతున్న ఓ ప్రచారానికి వివరణ ఇచ్చారు. తనకు టీడీపీ సీనియర్ నేత పరిటాల రవి గుండు కొట్టించారని కొంతమంది అభాండం వేశారని పవన్ కల్యాణ్ అన్నారు. అసలు అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. `నాకు ఎవరూ గుండు గీయించలేదు. చిరాకుగా ఉంటే నేను గుండు గీయించుకున్నా. నాకు గుండు గీయిస్తే ఊరుకునే వ్యక్తినా?`  అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిణామంపై పరిటాల రవి సతీమణి - ఆంధ్రప్రదేశ్ మహిళా - శిశు సంక్షేమశాఖ మంత్రి  సునీత స్పందించారు. తాజాగా సునీత మీడియాతో మాట్లాడుతూ...పవన్ కు గుండు కొట్టించారన్నది పూర్తి అవాస్తవం అని చెప్పారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నిజం చెప్పారని పరిటాల సునీత అన్నారు. పవన్ కళ్యాణ్ కు తన భర్త పరిటాల రవి గుండు ఎందుకు కొట్టిస్తారని ఆమె ప్రశ్నించారు. మా ఆయన అంత మూర్ఖుడు కాదని సునీత తెలిపారు. పవన్ కు పరిటాల రవి గుండు గీయించడంపై...ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మవద్దని పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో పవన్ నిజం చెప్పారని ఆమె వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారని పరిటాల సునీత చెప్పారు. ఇదిలాఉండగా...ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా పరిటాల సునీత విపక్ష నేతపై మండిపడ్డారు. అనుభవజ్ఞుడు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పథంలో నవ్యాంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని..అయినప్పటికీ విపక్షం ఉద్దేశ పూర్వక ఆరోపణలు చేస్తుందన్నారు.

కాగా ఈ సందర్భంగా ఏపీలోని మంత్రులు - ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులపై పవన్ మండిపడటం - అందులో పరోక్షంగా పరిటాల కుటుంబం ఉన్న సంగతి తెలిసిందే `ఇక్కడి మంత్రులు అక్కడివాళ్ల పెళ్లిళ్లకు - శుభకార్యాలకు వెళ్తారు.. తెలంగాణలో కాంట్రాక్టులు తెచ్చుకుంటారు.. ఇవి నేను చెప్పినవి కాదు.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు` అంటూ పవన్ అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.

కాగా పరిటాల కుటుంబ సభ్యులపై రేవంత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ``పరిటాల సునీత తనయుడు - ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పయ్యవుల కేశవ్ అల్లుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ బీరు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. అందుకే ఇటీవల పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైన కేసీఆర్ కు ఏపీ మంత్రులు వంగివంగి దండాలు పెట్టారు...నన్ను జైళ్ళో పెట్టించిన కేసీఆర్ కు ఏపీ నేతలు దండాలు పెడతారా?`` అంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన సంచలన కామెంట్లు చేశారు.