కేసీఆర్ తో పరిటాల కుటుంబ సభ్యులు మీటింగ్

Wed Sep 13 2017 22:50:04 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో ఏపీ మంత్రి పరిటాల సునిత భేటీ అయ్యారు. పరిటాల రవీంద్ర-సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఆహ్వానపత్రిక సీఎం కేసీఆర్ కు అందించారు. శ్రీరామ్ వివాహ ఆహ్వానానికి సీఎం కేసీఆర్ దంపతులను ఆహ్వానించిన సందర్భంగా పరిటాల సునీత వెంట తనయులు శ్రీరామ్ - సిద్దార్థ్ ఉన్నారు. వివాహానికి తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి సునీత కోరగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఓకే చేసినట్లు సమాచారం.కాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సునిత మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో తన పెద్ద కుమారుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ-సుశీల దంపతుల కుమార్తె జ్ఞానతో పరిటాల శ్రీరామ్ వివాహం జరగనున్నట్లు మంత్రి సునిత తెలిపారు. ఆగస్టు పదో తేదీన వీరిద్దరి నిశ్చితార్థం - అక్టోబర్ 1న వివాహం జరుగనున్నట్లు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు - తెలుగుదేశం పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - పార్టీ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పలువురికి ఆహ్వానాలు అందించిన పరిటాల సునీత తాజాగా తెలంగాణ సీఎంకు ఆహ్వానం ఇచ్చారు.

కాగా 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.