Begin typing your search above and press return to search.

పరిటాల శకం ఇక ముగిసినట్టేనా?

By:  Tupaki Desk   |   24 May 2019 11:34 AM GMT
పరిటాల శకం ఇక ముగిసినట్టేనా?
X
పరిటాల రవి.... తెలుగుదేశం పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా పవర్ ఫుల్ లీడర్ గా వెలుగొందారు. ఆయన హత్యానంతరం భార్య సునీత రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆమె స్వగ్రామం పెనుకొండ నుంచి రాప్తాడుకు మారింది. దీంతో రెండు సార్లు ఆమె రాప్తాడు ఎమ్మెల్యే గా గెలిచారు. ఈసారి తన కొడుకును గెలిపించుకోవడానికి ఆమె తన సీటును త్యాగం చేసింది. సర్వశక్తులు ఒడ్డినా జనం తిరస్కరించారు. కనీసం కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ప్రతి రౌండులోనూ శ్రీరాం ఓడిపోతూనే ఉన్నాడు.

పరిటాల ప్రభావం గాని - అభివృద్ధి ప్రభావం గాని - చంద్రబాబు ప్రభావం గానీ... ఏదీ పరిటాల శ్రీరామ్ ఓటమిని ఆపలేకపోయాయి. అనంతపురంలో 14లో 2 టీడీపీ గెలిస్తే ఆ రెండింటిలో ఈయన లేరు. ఇదిలా ఉంటే... ఓటమిని పరిటాల శ్రీరామ్ ఉదయాన్నే అంగీకరించక తప్పలేదు. రెండు రౌండ్లు మినహా పరిటాల శ్రీరామ్ పై ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి పైచేయి సాధించారు. 25వేల అఖండ మెజారిటీతో ప్రకాష్ రెడ్డి గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రేవంత్ రెడ్డి మీద గెలుపును టీఆర్ ఎస్ శ్రేణులు ఎలా ఎంజాయ్ చేశాయో.... పరిటాల కుటుంబం మీద గెలుపును కూడా వైసీపీ శ్రేణులు ఎంజాయ్ చేశాయి.

గత మూడేళ్లుగా ఇక్కడ ప్రకాష్ రెడ్డి పోటీపడటం వల్ల కూడా అతని పట్ల సానుభూతి ఉంది. దాంతో పాట్ జగన్ వేవ్ ఉంది. ప్రచారం సమయంలోనే నువ్వానేనా అన్నట్టుగా పోటీ సాగింది. శ్రీరామ్ ఓటమిపై అపుడే గాసిప్స్ వచ్చాయి. ఇపుడు అదే నిజమైంది.

నియోజకవకర్గంలో అభివృద్ధి చేశాం - పొలాలకు నీళ్లిచ్చాం... అంటూ వారు చెప్పిన మాటలు గాని - కొత్తగా ఇచ్చిన హామీలు గానీ ఏవీ నిలవలేదు. ఏకపక్షంగా వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బహుశా ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే... ఇక పరిటాల శకం ముగిసినట్టే అనుకోవాలి.