అనంతలో 'వారసుల ' అవినీతి 'ఆట'లు!

Sat Sep 23 2017 15:34:50 GMT+0530 (IST)

కంచె చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా....అన్న చందంగా ఉంది టీడీపీ నేతల పుత్ర రత్నాల పరిస్థితి. రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నేతలతో వారి వారసులు పోటీ పడుతున్నారు. తమ అధికారాలను ఉపయోగించుకొని టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే - వారి అండదండలతో వారసులు అందిన కాడికి చక్కబెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ నేతల పుత్రరత్నాలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు అనుచరులను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న అనంతపురంలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల కుంభకోణంలో మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం అనుచరులపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ నకి'లీల'ల వెనుక  శ్రీరాం హస్తం ఉందని విమర్శలు వచ్చాయి. తాజాగా అదే తరహాలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అక్రమంగా నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒలింపిక్ అసోసియేషన్ నిధులను అక్రమంగా డ్రా చేశారని ఆరోపిస్తూ పవన్ కుమార్ రెడ్డిపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. పవన్ కుమార్ రెడ్డి అక్రమాలను ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మీడియాకు వెల్లడించారు.ఎంపీ గల్లా జయదేవ్ - ఎంపీ సీఎం రమేశ్ ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లున్నాయి.  సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షుడిగా - రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ఒలింపిక్ అసోసియేషన్ బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఆ  ఫ్రీజ్ చేసిన అకౌంట్ల లో నుంచి రూ.18 లక్షలు డ్రా అయ్యాయి. ఆ డబ్బును జేసీ పవన్ - సీఎం రమేశ్ - జీసీ రావులు డ్రా చేశారని హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ వివాదంపై కోర్టులో సివిల్ - క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు - సాఫ్ట్ బాల్ - ఫెన్సింగ్ - జూడో అసోసియేషన్లు ఆ గేమ్స్ పై కనీస అవగాహన లేని వారికి మ్యాచ్ ఆడినట్లు నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో సాఫ్ట్ బాల్ - ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు - మురళీకృష్ణల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

వారిద్దరూ పరిటాల శ్రీరాం అండతోనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. భవిష్యత్ లో ఏదైనా ఇబ్బంది వస్తే పరిటాల శ్రీరాం వంటి ప్రముఖులు అండగా ఉంటారనే ఉద్దేశంతోనే అధికారులు - రాజకీయ నేతల పిల్లలు కూడా ఈ నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తోంది. ఎంసెట్ లో సీటు సాధించేందుకే ఈ నకిలీ సర్టిఫికెట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కుంభకోణాల్లోనూ కాకతాళీయంగా  ‘అనంత’ వాసులు ఉండటంతో జిల్లా పరువు మసకబారుతోంది. క్రీడలకు ఏమాత్రం సంబంధంలేని వారు అసోసియేషన్లను శాసిస్తున్నారని మాజీ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు అసోసియేషన్ లలో వేలు పెట్టడం వల్లే అవినీతి జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు అంశాలే వెలుగులోకి వచ్చాయని  ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్నిఅవకతకలు బయటపడతాయని వారు చెబుతున్నారు. అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసోసియేషన్ లో కేవలం మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.