Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రక్షాళన చేయాల్సింది ఇదే..

By:  Tupaki Desk   |   23 April 2019 4:51 AM GMT
కేసీఆర్ ప్రక్షాళన చేయాల్సింది ఇదే..
X
ఒకరు.. ఇద్దరు కాదు.. లక్షల మంది భావిభారత విద్యార్థుల భవిష్యత్ తో ఆటలు.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్వాకంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో ముందుగానే ఫలితాలు విడుదల కావడం.. వారు ఎంసెట్ కు ప్రిపేర్ కావడం.. అంతా పకడ్బందీగా జరిగిపోతోంది. ధనిక రాష్ట్రం, నిధులున్న తెలంగాణలో మాత్రం ఇంత దుర్లభమైన ఇంటర్మీడియెట్ బోర్డు ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

తెలంగాణ ఏర్పడగానే ఇంటర్, ఎంసెట్ నిర్వహణలో బోర్డు వైఫల్యం బయటపడింది. ఎంసెట్ లీకేజ్ కావడం.. కొందరు లబ్ధి పొందడం.. పరీక్ష రద్దు చేసి మళ్లీ పెట్టడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరువు పోయింది. నాడు కేసీఆర్ ఎంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నా.. ఐదేళ్లు గడిచినా అదే నిర్లక్ష్యం.. ఇప్పుడది తెలంగాణ విద్యార్థుల పాలిట శాపంగా మారిపోయింది..

ఇటీవల ఇంటర్ ఫలితాల్లో ఓవిద్యార్థికి పరీక్షలో సున్నా మార్కులు వచ్చాయని రీవాల్యూయేషన్ చేయించుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ టాపర్ కూడా సెకండియర్ లో ఫెయిల్ అయిపోయాడు. ఇలాంటి ఉదంతాలెన్నో.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది కాబట్టే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ ఎదుట ఆందోళన చేపట్టారు.

నిజానికి రాష్ట్రంలో కేసీఆర్ రెవెన్యూ ప్రక్షాళనకు నడుం బిగించారు. దానికంటే ముందే భ్రష్టు పట్టిపోయిన తెలంగాణ ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉన్న లక్షల మంది విద్యార్థుల భవితతో ఆడుతున్న బోర్డును రద్దు చేసి తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నారు. కేసీఆర్ స్పందిస్తాడో లేదో చూడాలి మరీ..