Begin typing your search above and press return to search.

బూడిదలో పోసిన ‘పన్నీరు’

By:  Tupaki Desk   |   16 Feb 2017 10:47 AM GMT
బూడిదలో పోసిన ‘పన్నీరు’
X
తమిళనాడు లేటెస్టు రాజకీయ ఎపిసోడ్ ను పరిశీలిస్తే ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం అంత దురదృష్టవంతుడు, చేతకానివాడు రాజకీయాల్లో ఇంకొకరు లేరేమో అనిపిస్తుంది. అప్పుడెప్పుడో పదహారేళ్ల కిందటే సీఎం అయినా.. ఆ తరువాత కూడా అమ్మ చలువతో అవసరాన్ని బట్టి ఎన్నోసార్లు సీఎం అయినా కూడా ఇప్పటివరకు పట్టుమని పది మంది ఎమ్మెల్యేలను తన వర్గంగా చేసుకోలేని పన్నీర్ ను అంతా జాలి పడుతున్నారు. ప్రత్యర్థులు ఎగతాళి చేస్తున్నారు. శశికళను ఢీకొట్టడంతో ఓవర్ నైట్ హీరోగా మారినా క్లైమాక్సులో మాత్రం ఏ ఫలితం అందుకోకుండా మళ్లీ జీరోకు వచ్చేశాడు పన్నీర్. ఆయన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

సీఎం పదవి అటు శశికళకూ దక్కక.. ఇటు పన్నీర్ కూ దక్క మధ్యలో పళనిస్వామి ఎగరేసుకుపోయాడు. తమిళనాడుపై తమ పట్టు పెంచుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పన్నీర్ ను ముందు పెట్టి.. ఈ రాజకీయ నాటకం ఆడిందనే ఆరోపణలున్నాయి. లేకపోతే ఇంతకాలం పార్టీలో వీర విధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం ఇలా ఒక్కసారిగా తిరుగుబాటు చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ మొత్తం వ్యవహారానికి తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే కూడా ఓ చేయి వేసి సాయం అందించింది.

అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడంతా సీఎం పదవి ఖాళీ కాగానే పన్నీరే సీఎం అయ్యేవారు. జయలలిత ఆస్తుల కేసులో జైలుకు వెళ్లిన రెండు సార్లూ పన్నీర్ సెల్వంనే తాత్కాలిక సీఎంగా కూర్చోబెట్టారని.. ఆమె మరణించాకా ఆయనే సీఎం అయ్యారు. శశి ఒత్తిడితో రాజీనామా చేశాక కూడా పన్నీరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారు. ఒకవేళ ఆయన తిరుగుబాటు చేయకుండా సైలెంటుగా ఉంటే శశికళ సీఎం అయ్యే ఛాన్సుండేది.. ఆ వెంటనే ఆమె జైలుకెళ్తే మళ్లీ పన్నీర్ కే ఎక్కువ ఛాన్సుండేది.

కానీ, పన్నీర్ అడ్డం తిరిగారు. శశికళకు బద్ధ విరోధి అయ్యారు. కానీ, శశికళ శిబిరం నుంచి తనకు కావాల్సినంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోలేకపోయారు. దీంతో శశికళ సీఎం కాలేకపోయినా, ఆమె జైలుకు వెళ్లినా కూడా పన్నీర్ మాత్రం సీఎం కాలేకపోయారు. దీనంతటికీ కారణం తొలి నుంచి పార్టీలో తనకంటూ పదిమందిని వెంట తిప్పుకోలేకపోవడమే. జనం నుంచి.. కేంద్రం నుంచి.. అమ్మ కుటుంబ సభ్యుల నుంచి ఇంత మద్దతు ఉన్నప్పుడే ఏమీ చేయలేని పన్నీర్ భవిష్యత్తులో బలపడతారన్నది అనుమానమే. ఆయన పొలిటికల్ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే అనుకోవాలి. భవిష్యత్తులో ఆయన వేరే పార్టీకి మారితే స్వంత ఇమేజిలో ఎమ్మెల్యేగా మాత్రం గెలిచే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/