Begin typing your search above and press return to search.

రెండు స్తంభాలకు కొత్త క‌థ

By:  Tupaki Desk   |   27 March 2017 6:55 AM GMT
రెండు స్తంభాలకు కొత్త క‌థ
X
జైల్లో ఉన్న చిన్న‌మ్మ.. స్వ‌ప‌క్షీయుల‌పై అగ్గి మీద గుగ్గిలం కావ‌టంలో త‌ప్పు లేదు. ఆమె ఏం ఊహించిందో ఇప్పుడు త‌మిళ‌నాడులో అదే జ‌రుగుతోంది. అమ్మ మ‌ర‌ణంతో జ‌ర‌గ‌నున్న ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని చేజిక్కించుకోవ‌టంలో ఫెయిల్ కావ‌టం.. ఎన్నిక‌ల సంఘం గుర్తుల్ని కేటాయించిన వేళ‌.. టోపీ గుర్తును ఎన్నుకున్న వైనంపై ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. టోపీ గుర్తుతో ఎన్నిక‌ల‌కు వెళితే.. ప్ర‌జ‌ల్లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేశారు. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

అమ్మ మ‌ర‌ణం తర్వాత అన్నాడీఎంకే రెండు ముక్క‌లు కావ‌టం.. ఒక‌ప‌క్షానికి చిన్న‌మ్మ‌.. రెండో ప‌క్షానికి విధేయుడు ప‌న్నీర్ సెల్వం నేతృత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఇరు వ‌ర్గాల‌కు అన్నాడీఎంకే గుర్తు అయిన రెండాకుల్ని ఈసీ కేటాయించ‌లేదు. దీని స్థానే వేరే గుర్తుల్ని ఎంపిక చేసుకోవాల‌న్న‌ప్పుడు ప‌న్నీరు వ‌ర్గం రెండు విద్యుత్ స్తంభాల్ని ఎంచుకోగా.. చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గం టోపీని ఎన్నిక‌ల గుర్తుగా ఎంచుకున్నారు. ఈసీకేటాయించిన రెండు విద్యుత్ స్తంభాల‌పై మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

రెండు విద్యుత్ స్తంభాల్లో ఒక‌టి ఎంజీఆర్ అని.. రెండోది అమ్మ‌దంటూ ప‌న్నీర్ సెల్వం చెబుతున్నారు. అన్నాడీఎంకే పుర‌ట్చి త‌లైవి ఒక స్తంభ‌మైతే.. మ‌రో స్తంభం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీఆర్‌ గా ఆయ‌న అభివ‌ర్ణిస్తున్నారు. రెండు ఆకుల బ‌దులుగా రెండు స్తంభాలు ల‌భించ‌టం కార‌ణంగా త‌మ విజ‌యం క‌ష్టం కాద‌ని.. గెలుపు త‌మ‌దేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నిక‌లు ఏ విధంగా నిర్వ‌హించినా ప్ర‌జ‌లు త‌మ‌కే ఓటు వేస్తార‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్న ఆయ‌న‌.. త‌మ ప‌క్షం నుంచి బ‌రిలోకి దిగుతున్న మ‌ధుసూద‌నన్ స్థానిక ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడ‌న్నారు. ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు. రెండాకుల‌కు బ‌దులుగా రెండు స్తంభాల గుర్తు రావ‌టంపై ప‌న్నీర్ వ‌ర్గంలో గెలుపుపై ధీమా వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/