రజనీకి అప్పుడే హెచ్చరికలు మొదలయ్యాయి

Fri May 19 2017 21:40:18 GMT+0530 (IST)

తమిళనాడు రాజకీయాల్లో జనాకర్షణ ప్రజాధారణ కలిగిన నాయకురాలైన జయలలిత మృతి చెందడం డీఎంకే సుప్రీమో కరుణానిధి అనారోగ్య కారణంతో ఇంటికే పరిమితం కావడంతో తమిళనాడులో క్రీయాశీల రాజకీయ శూన్యత ఏర్పడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ దేవుడి ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా అని చెప్పడంతో మరొకమారు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం తన అభిప్రాయాన్ని వినిపించారు. రజనీకాంత్ ఓ మంచి వ్యక్తి అని రాజకీయాల్లోకి ఆయన ప్రవేశాన్ని స్వాగతిస్తామని పన్నీరు సెల్వం అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన జరిగిన తర్వాత తాము ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

మరోవైపు తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒకింత భావోద్వేగంతో మాట్లాడుతున్న స్టాలిన్ కు అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేస్తూ  ఆయన తనకు మంచి స్నేహితుడు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. స్నేహితుడిగా భావించిన రజనీకి స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రవేశంపై రజనీ త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్ సూచించారు. అయితే బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రజనికాంత్‌కు స్టాలిన్ పరోక్ష హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని అందుకే ముందుగా జాగ్రత్త పడాల్సిన ఎంతైనా ఉందన్నారు.

కేంద్ర మాజీమంత్రి పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ మాట్లాడుతూ ``రజనీకాంత్ మంచివాడే. ఆ విషయం అందరికీ తెలుసు. తమిళ రాజకీయాలకు ఇప్పుడు డాక్టర్ కావాలి గానీ యాక్టర్ అక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రం ఐసీయూలో ఉంది``. అని వ్యాఖ్యానించారు. యాక్టర్లు రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు నాశనం చేశారని అది ఎంజీఆర్ కావచ్చు జయలలిత కావచ్చు అందరూ అలాగే చేశారని పరోక్షంగా రజనీకాంత్ ఎంట్రీపై పెదవి విరిచారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు పనికి రారని బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళులు విద్యాధికులనీ నిరక్షరాస్యుడైన రజనీకాంత్ ను వారు సీఎంగా అంగీకరించబోరని స్వామి అభిప్రాయపడ్డారు. ఒకవేళ రజనీకాంత్ బీజేపీతో పొత్తుపెట్టుకుంటే దానిని తాను వ్యతిరేకిస్తాననీ సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/