Begin typing your search above and press return to search.

తొండి వాదన మొదలెట్టిన ‘వీడియో ఎంపీ’

By:  Tupaki Desk   |   27 July 2016 6:54 AM GMT
తొండి వాదన మొదలెట్టిన ‘వీడియో ఎంపీ’
X
ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా.. పార్లమెంటు భద్రత మొత్తం బయట ప్రపంచానికి తెలిసేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి చేయకూడని తప్పు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ తొండి వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఆయన వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రతి పార్టీ తప్పు పడుతున్న వేళ.. ఆయనపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏర్పాటు చేయటం.. ఈ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ లోక్ సభకు హాజరుకావొద్దంటూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తన తప్పుపై తొలుత సారీ చెప్పిన ఆయన.. తాజాగా చిత్రమైన తొండి వాదన ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు. తాను చేసింది తప్పు అయితే.. ప్రధాని మోడీ తన కంటే వంద రెట్లు పెద్దదైన తప్పు చేశారన్నారు. ఇంతకీ మోడీ చేసిన తప్పు ఏమిటన్న మాటకు ఆయన చెబుతున్న వాదన ఏమిటంటే.. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయటం.. ఈ కేసు విచారణలో భాగంగా ఐఎస్ ఐని పిలిపించి ప్రధాని పెద్ద తప్పు చేశారంటున్నారు.

పార్లమెంటు సముదాయాలపై దాడి చేసిన ఐఎస్ ఐ సంస్థే ఈ ఏడాది పఠాన్ కోట్ స్థావరంపై కూడా దాడికి దిగిందని.. ఆ సంస్థను పఠాన్ కోట్ స్థావరం చూపించటం ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడి అంశంపై పాక్ అధికారులను పరిమితంగా ఆధారాలుచూపించిన విషయాన్ని తనదైన శైలిలో తొండి వాదనతో ఆయన ఒక లేఖ రాసి స్పీకర్ కు పంపటం గమనార్హం. ఒకవేళ భగవత్ చెప్పినట్లుగా మోడీ తప్పే చేసి ఉంటే.. ఇప్పటివరకూ ఆ తప్పును ఎవరూ ఎందుకు ప్రస్తావించనట్లు? చేసిన తప్పును హుందాగా ఒప్పుకుంటే ఎంతోకొంత మర్యాద మిగులుతుంది. కానీ.. అందుకు భిన్నంగా ఇలాంటి తొండి వాదన చేస్తే ఉన్న కాస్త మర్యాద.. సానుభూతి సైతం పోతుందన్న విషయం భగవత్ కు ఎప్పటికి తెలుస్తుందో..?