Begin typing your search above and press return to search.

ప‌త‌నం అంచున ప‌ళ‌ని స‌ర్కార్‌.. నిజం ఏంటి?

By:  Tupaki Desk   |   15 Jun 2018 5:28 AM GMT
ప‌త‌నం అంచున ప‌ళ‌ని స‌ర్కార్‌.. నిజం ఏంటి?
X
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి ప‌ద‌వీ గండం పొంచి ఉందా? ఆయ‌న సీఎం కుర్చీ నుంచి దిగిపోయే టైం ద‌గ్గ‌ర‌కువ‌చ్చిందా? త‌మిళ‌నాడు రాజ‌కీయం మ‌రో భారీ కుదుపున‌కు లోన‌య్యే అవ‌కాశం ఉందా? అంటే.. అవున‌ని చెబుతున్నారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో త‌మిళ‌నాడు రాజ‌కీయ సీన్ మొత్తం మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. రెండు విరుద్ధ తీర్పులు వెలువ‌డిన వేళ‌.. మూడో తీర్పు వెలువ‌డిన వెంట‌నే అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

లాజిక్ గా చూసిన‌ప్పుడు కూడా ఇది నిజ‌మ‌నిపించ‌క‌మాన‌దు. ఇంత‌కూ ఈ ప‌రిస్థితికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీటీవీ దిన‌క‌ర‌న్ వ‌ర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసుపై మ‌ద్రాస్ హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం రెండు ర‌కాల తీర్పుల్ని ఇచ్చింది.

ఈ రెండు తీర్పుల్ని చూస్తే..

మొద‌టిది: అన‌ర్హ‌త స‌బ‌బే అని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఇందిరా బెన‌ర్జీ చెప్పారు
రెండోది: అన‌ర్హ‌త స‌రికాద‌ని మ‌రో జ‌డ్జి జ‌స్టిస్‌ సుంద‌ర్ చెప్పారు.

మ‌రిప్పుడు ఏం కానుంది?
ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు వేర్వేరు తీర్పుల్ని ఇచ్చిన నేప‌థ్యంలో మూడో జ‌డ్జి ఎలాంటి తీర్పు ఇవ్వ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు వేర్వేరుగా తీర్పులు ఇవ్వ‌టంతో.. దీనిపై నిర్ణ‌యానికి మూడో న్యాయ‌మూర్తి ప‌రిశీల‌న‌కు పంపుతున్నారు. మూడో జ‌డ్జి తీర్పు ఇచ్చే వ‌ర‌కూ అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష జ‌ర‌గ‌దు.

మూడో జ‌డ్జి ఏం చెబితే.. ఏం జ‌రుగుతుంది?
అన‌ర్హ‌త‌పైన మూడో జ‌డ్జి క‌నుక స‌బ‌బు అన్న తీర్పు ఇస్తే.. 18 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అదే జ‌రిగితే.. ఉప ఎన్నిక‌ల్లో డీఎంకే విజ‌యం ఖాయం. అదే జ‌రిగితే ప‌ళ‌ని స‌ర్కారుకు రోజులు ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే. అందుకు భిన్నంగా అన‌ర్హ‌త వేటు పిటిష‌న్ ను మూడో జ‌డ్జి కానీ కొట్టేస్తే.. 18 మంది ఎమ్మెల్యేలు స‌భ‌లో డీఎంకే.. కాంగ్రెస్ ల‌తో క‌లిసి ప్ర‌భుత్వానికి ఓటు వేసే వీలుంది. అలా కాకుండా 18 మంది ఎమ్మెల్యేల్లో కొంద‌రు అధికార ప‌ళ‌ని స‌ర్కారుకు అనుకూలంగా ఓటు వేస్తే ప‌ద‌వీ గండం నుంచి త‌ప్పించుకునే వీలుంది.

అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌ళ‌ని స‌ర్కారుకు ప‌ద‌వీ గండం ముంచుకొస్తుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇంత‌కీ ఈ 18 మంది ఎమ్మెల్యేల లొల్లి ఎందుకు తెర మీద‌కు వ‌చ్చింద‌న్న‌ది చూస్తే..అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత చిన్న‌మ్మ చ‌క్రం తిప్ప‌టం.. త‌ర్వాత ఏర్ప‌డిన చీలిక‌లో 18 మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లిన చిన్న‌మ్మ‌కు ద‌న్నుగా నిలిచారు. వీరంతా త‌మ మ‌ద్ద‌తు ప‌ళ‌నిస్వామికి లేద‌ని.. తాము మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ కు లేఖ‌లు ఇచ్చారు. దీంతో.. ప్ర‌భుత్వ విప్ రాజేంద్ర‌న్ స్పీక‌ర్ ధ‌న‌పాల్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆయ‌న త‌న క‌లానికి ఉన్న ప‌వ‌ర్ తో 18 మంది మీద వేటు పోటు వేశారు. దీంతో.. వారు కోర్టుకు ఎక్కారు. కోర్టులో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంతో ఈ ఇష్యూ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మొత్తంగా చూస్తే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌ద‌వీ గండం నుంచి ప‌ళ‌నిస్వామి త‌ప్పించుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.