Begin typing your search above and press return to search.

చిన్నపాప చేతిలో ఏకే 47.. మోడీకి వార్నింగ్!

By:  Tupaki Desk   |   26 Sep 2016 2:07 PM GMT
చిన్నపాప చేతిలో ఏకే 47.. మోడీకి వార్నింగ్!
X
చిన్నారి బాలిక ఉంటే ఆమె తండ్రి ఆమెకు ఏమి నేర్పుతాడు.. పక్కన కుర్చోబెట్టుకుని కథలు చెబుతాడు, తినుబండారాలు తినిపిస్తాడు లేక ఏవో కబుర్లు - నీతివాక్యాలు చెబుతాడు.. భారతదేశంలో అయితే ఇలాగే జరుగుతుంది! మరి పాక్ లో ఎలా జరుగుతుంది? దానికి చిన్న ఉదాహరణ తాజాగా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. తండ్రి అనేవాడు చేయకూడని పని ఒక పాకిస్థాన్ తండ్రి చేస్తున్నాడు.. చిన్నారి బాలికను పక్కన కూర్చోబెట్టుకుని ఏకంగా ఏకే 47 గన్ పేలిపిస్తూ పక్కనున్న దేశానికి - ఆ దేశ ప్రధానికి వార్నింగ్ ఇప్పిస్తున్నాడు.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం!

పాకిస్థాన్ కు చెందిన ఓ చిన్నారి బాలిక ఏకే 47 గన్ చేతబట్టి భారత్ కు - భారత ప్రధాని నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో తన తండ్రి పక్కన కూర్చున్న ఒక చిన్నారి బాలిక ఏకంగా ఏకే 47 గన్ పట్టుకుని ఉంది. ఈ పాప మాట్లాడిన భాష పూర్తిగా అర్థం కాదు కానీ, పాప మాత్రం తన వేలు చూపిస్తూ భారత్ ను - మోడీని హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడింది. ఆ మాటలు ముగిసిన అనంతరం ఏకే 47 తూటాలు పేల్చింది. మాటలు పూర్తయిన తర్వాత ఆ గన్ ఎలా పేల్చాలో ఆ తండ్రే స్వయంగా పాపకు నేర్పించాడు. ఈ చర్యను భారతీయులు తీవ్రంగా విమర్శించారు.

కాగా, ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి అనంతరం భారత్ - పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దాడిని ఇప్పటికే ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక భారత్ లో కూడా అన్ని పార్టీల నాయకులు - సెలెబ్రిటీలు - మేధావులు - సామాన్యులు పాక్ పై విరుచుకుపడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఎం.ఎన్.ఎస్. అయితే పాక్ కు చెందిన నటీనటులందరూ 48 గంటల్లో దేశం విడిచిపోవాలని అల్టిమేటమే జారీచేసింది. అయితే పాక్ మాత్రం చివరకు చిన్నపిల్లల్లో కూడా విషాన్ని నింపుతూ తన యుద్ధకాంక్షను బయటపెట్టుకుంటోంది.